ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలో పలువురు విపక్ష నేతలు ఉమ్మడిగా లేఖ రాశారు. ఈ లేఖపై 9 మంది ప్రతిపక్ష నేతలు సంతకం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలో పలువురు విపక్ష నేతలు ఉమ్మడిగా లేఖ రాశారు. 9 మంది ప్రతిపక్ష నేతలు ఈ లేఖపై సంతకం చేశారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర సంస్థల దుర్వినియోగం, రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌ల జోక్యం.. తదితర అంశాలపై ఈ లేఖలో ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికి ఉందని తాము నమ్ముతున్నామని తెలిపారు. ప్రజా తీర్పును గౌరవించాలని లేఖలో వారు కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, గవర్నర్ వ్యవస్థల దుర్వినియోగం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. మనీష్ సిసోడియా అరెస్ట్‌ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. 

ప్రధాని మోదీకి లేఖవారిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీస్ సిసోడియా అరెస్టును రాజకీయ కుట్రలో భాగమని విపక్ష నేతలు ఆరోపించారు. ‘‘సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. రాజకీయ కుట్రలో భాగమే. ఆయన అరెస్ట్ దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది. ఢిల్లీ పాఠశాల విద్యను మార్చినందుకు మనీష్ సిసోడియా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అతని అరెస్టు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వేటకు ఉదాహరణగా పేర్కొనబడుతుంది. నిరంకుశ బిజెపి పాలనలో భారతదేశం ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని అనుమానిస్తున్న ప్రపంచం.. దానిని మరింత ధ్రువీకరిస్తుంది’’ అని పేర్కొన్నారు. 

అలాగే కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారాలు, ప్రయోజనాల కోసం కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుంటుందని కూడా లేఖలో ఆరోపించారు. ‘‘కేంద్ర ఏజెన్సీలను, గవర్నర్ వంటి రాజ్యాంగ కార్యాలయాలను.. ఎన్నికల రణరంగం వెలుపల ప్రతీకారం తీర్చుకోవడానికి దుర్వినియోగం చేయడం ఖండించదగినది. ఇది మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 2014 నుంచి ఈ ఏజెన్సీలను ఉపయోగిస్తున్న తీరు వారి ప్రతిష్టను దిగజార్చింది. వారి స్వయంప్రతిపత్తి, నిష్పాక్షికత గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ ఏజెన్సీలపై భారతదేశ ప్రజల విశ్వాసం సన్నగిల్లుతూనే ఉంది’’ అని లేఖలో ప్రతిపక్షాల నాయకులు పేర్కొన్నారు.