నూతన పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నంపై వివాదం రాజుకుంది. ఈ చిహ్నంలోని సింహాలు క్రౌర్యం, ఆగ్రహంతో గర్జిస్తున్నట్టు ఉన్నాయని ప్రతిపక్షాలు ఫైర్ అయ్యాయి. అదే మౌర్య పాలకుడు అశోకుడి కాలంలో సారనాథ్ స్థూపంపై నిర్మించిన సింహం ముఖంలో సౌమ్యత, నియంత్రిత రాజసం కనిపిస్తాయని పేర్కొన్నాయి. ఈ విమర్శలపై కేంద్ర మంత్రి స్పందించారు. 

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన జాతీయ చిహ్నం కేంద్రంగా వివాదం ముదురుతున్నది. ఆ జాతీయ చిహ్నంలోని సింహాలు.. 1950లో భారత ప్రభుత్వం ఎంచుకున్న జాతీయ చిహ్నంలోని సింహాలకు చాలా వ్యత్యాసం ఉన్నదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. సింహంలోనూ శాంతి, నియంత్రిత రాజసాన్ని చూపించే ప్రయత్నం అశోకుడి కాలంలో సారనాథ్ స్థూపంపై ఉన్న సింహం విగ్రహంలో ఉన్నదని, అశోకుడి ఉద్దేశం కూడా అదే అయి ఉంటుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. సారనాథ్ స్థూపంపై ఉన్న సింహం బొమ్మను జాతీయ చిహ్నంలోకి భారత ప్రభుత్వం తీసుకున్నదని తెలిపాయి. కానీ, ఇప్పుడు నూతన పార్లమెంటు భవనంపై కనిపిస్తున్న జాతీయ చిహ్నంలోని సింహాలు క్రౌర్యంగా, కోపంగా గర్జిస్తున్నట్టుగా ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ మార్పు ఎందుకు అని ప్రశ్నిస్తూ వెంటనే జాతీయ చిహ్నాన్ని మార్చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ వాదనలకు కేంద్ర ప్రభుత్వం, ఆ విగ్రహ శిల్పులు కూడా సమాధానం ఇచ్చారు.

సారనాథ్ స్థూపంపై ఉన్న సింహంతో పోల్చితే.. నూతన పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన జాతీయ చిహ్నం చాలా పెద్దదని కేంద్రం తెలిపింది. అయితే, కొత్త చిహ్నాన్ని కింది నుంచి చూడటం.. కింది నుంచి పైకి చూసే కోణంలో చిత్రాలను తీయడం మూలంగా ఆ సింహాలు కోపంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయని వివరించింది. శిల్పులు కూడా సారనాథ్‌లోని స్థూపంపై ఉన్న సింహం విగ్రహానికి రూపమేనని, తాము ఏ మార్పూ చేయలేదని తెలిపారు.

నూతన పార్లమెంటు భవనంపై ఆవిష్కరించిన చిత్రాన్ని, అశోకుడి సింహం విగ్రహాన్ని లేదా జాతీయ చిహ్న చిత్రాలను పక్కన పక్కన ఉంచుతూ సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఆ రెండు ఫొటోల్లోని తేడాలను ఎత్తి చూపుతూ కేంద్రంపై విరుచుకుపడ్డాయి. వెంటనే కొత్త చిహ్నం స్థానంలో పాత చిహ్నం పెట్టాలని డిమాండ్ చేశారు. లాలు ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రియ జనతా దళ్ తన శైలలిలో కేంద్రంపై విమర్శలు చేసింది. జాతీయ చిహ్నంలో సింహాల ముఖాలు సౌమ్యతతో నిండి ఉండగా.. అమృతకాలంలో రూపొందించిన జాతీయ చిహ్నంలో దేశంలోని పౌరులే కాదు.. ప్రతీదాన్ని వేటాడి తినేసే స్వభావం కనిపిస్తున్నదని ఆరోపించింది. చిహ్నం ఆ మనిషి స్వభావాన్ని.. లేదా మనిషి స్వభావాన్ని చిహ్నాలు స్పష్టంగా బహిర్గతం చేస్తాయని విమర్శించింది.

కాగా, టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అశోకుడి సింహాలతో ఉన్న జాతీయ చిహ్నానికి ఇది అవమానం అని ట్వీట్ చేశారు. ఒరిజినల్ చిహ్నంలో సొగసైన.. రాజసం కనిపిస్తుండగా.. మోడీ వర్షన్ సింబల్‌లో అవసరంలే కోపం, గర్జిస్తున్నట్టుగా ఉన్న సింహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సిగ్గు చేటు అని, వెంటనే చేంజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ విమర్శలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. సారనాథ్‌ ఎంబ్లెమ్‌నూ కింది నుంచి చూస్తే శాంతంగా కనిపిస్తాయా? కోపంగా కనిపిస్తాయా? అని ప్రశ్నించారు. సారనాథ్‌లోని ఎంబ్లెమ్ ఎత్తు 1.6 మీటర్లు అని, కొత్త పార్లమెంటు భవనంపైని చిహ్నం 6.5 మీటర్ల ఎత్తు ఉన్నదని వివరించారు.