కుల గణన జరుపుతాం.. మైనార్టీలు, కశ్మీరీ పండితులపై నేరాలకు అడ్డుకట్ట వేస్తాం: ప్రతిపక్షాల ఐక్య ప్రకటన
ఈ రోజు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. అనంతరం, అవి ఐక్య ప్రకటన చేశాయి. మొదటి అడుగుగా కుల గణన అమలు చేస్తామని స్పష్టం చేశాయి. మైనార్టీలు, మహిళలు, దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న నేరాలను ఆపుతామని చెప్పాయి.

బెంగళూరు: వచ్చే లోక్ సభ ఎన్నికలకు పోరాటానికి వేదికలు ఖరారైనట్టుగా కనిపిస్తున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలు ఎన్డీయే వర్సెస్ ఇండియాగా రెండు పక్షాల మధ్య ద్విముఖ పోరు జరిగేలా కనిపిస్తున్నది. అధికార ఎన్డీయేను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదికి వచ్చాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ, ఆప్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ సహా 26 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. గత యూపీఏలోని పార్టీలకు తోడు మరిన్ని పార్టీలు వచ్చి కూటమిలో చేరడంతో దీని పేరు మార్చారు. దాన్ని ఇండియా(INDIA-Indian National Developmental Inclusive Alliance)గా నామకరణం చేశారు. అన్ని పార్టీల మధ్య సమన్వయం కోసం 11 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీ అనంతరం, ప్రతిపక్షాలు ఐక్య ప్రకటన చేశాయి. ఆ ప్రకటన కీలకంగా ఉన్నది.
సామూహిక సంకల్పం పేరిట విడుదల చేసిన ఈ ప్రకటనలో భారత రాజ్యాంగం సూచించిన విలువల భారత దేశ ఆత్మను కాపాడుకోవడానికి సమాయత్తం కావాలని తామంతా నిర్ణయించుకున్నట్టు ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. గణతంత్ర దేశాన్ని బీజేపీ ఒక క్రమపద్ధతిలో తీవ్రంగా నష్టపరుస్తున్నదని తెలిపాయి. ప్రస్తుతం దేశ చరిత్రలోనే మనం ఒక సంక్లిష్ట సమయంలో ఉన్నామని వివరించాయి. భారత రాజ్యాంగానికి మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, సమాఖ్యతలపై పద్ధతిగా దెబ్బతీస్తున్నదని ఆరోపించాయి.
Also Read: బ్రేకింగ్ : సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
మణిపూర్ ధ్వంసమైపోతున్నదని, ఈ మానవ విషాదంపై పార్టీలన్నీ ఆందోళన వెలిబుచ్చాయి. దేశ సమాఖ్య నిర్మాణం, రాజనీతిని ఉద్దేశపూర్వకంగా బలహీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు బీజేపీయేతర రాష్ట్రాల్లో రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని ఆరోపించాయి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ ప్రత్యర్థులపట్ల ఏజెన్సీలను దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నాయి.
మైనార్టీలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఈ విద్వేషాన్ని, హింసను ఓడించడానికే తాము అంతా ఒక్కటవుతున్నామని సంయుక్త ప్రకటనలో విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. మహిళలు, దళితులు, ఆదివాసీలు, కశ్మీరీ పండితులుపై నేరాలను ఆపడానికి ఏకమవుతున్నామని వివరించాయి. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గళాలను వినడానికి ఐక్యమవుతున్నామని పేర్కొన్నాయి. మొదటి అడుగుగా కుల గణన అమలు చేస్తామని ముక్తం కంఠం పేరిట చేసిన తీర్మానాల్లో అవి వివరించాయి.