ముజఫర్ నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల మహిళను సోదరులు గొంతు నులిమి చంపేసి, ఆమెకు అంత్యక్రియలు చేశారు. మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే కోపంతో వారు ఆ పనిచేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కూక్డా గ్రామంలోచోటు చేసుకుంది. 

మహిళ సోదరులు సుమిత్ కుమార్, సోనులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. న్యూ మండీ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్టు చేశారు. మహిళ ప్రియుడు జుల్ఫీకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. 

మహిళను చంపేసి, ఆమె శవాన్ని కాల్చేశారని, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆ పనిచేశారని జుల్ఫీకర్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఆమె భర్త ఏడాది క్రితం ప్రమాదంలో మరణించాడు. ఈ స్థితిలో ఆమె జుల్ఫీకర్ తో సంబంధంలోకి వచ్చి, అతన్ని పెళ్లి చేసుకుందామని భావించింది.

ఏడేళ్ల క్రితం ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూక్డాలోని తన తల్లిగారింటికి వచ్చింది.