ట్రాఫిక్ నిబంధనలు పాటించలేదని ఓ పోలీసు మరో పోలీసుకు ఫైన్ విధించారు. ఈ పరిణామం బెంగళూరు సిటీలో చోటు చేసుకుంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా ప్రజలు రోడ్డుపై వాహనాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే పోలీసులు ఫైన్ వేస్తారు. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, సీటు బెల్టు పెట్టుకోకపోతే, టూ వీలర్ పై ముగ్గురు ప్రయాణిస్తుంటే, ఇంకా ఆ వాహనానికి సంబంధించిన పత్రాలు మెయింటెన్ చేయకపోతే జరిమానా విధిస్తారు. అయితే ఇవన్నీ సాధారణ ప్రజలకే వర్తిస్తాయని, పోలీసులకు, ప్రముఖులకు వర్తించవని చాలా మందిలో ఓ అభిప్రాయం నెలకొంది. చాలా సందర్భాల్లో పోలీసు తమ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా చూసి చూడనట్లు వదిలేయడం చాలా మంది గమనించే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో నిబంధనలు పాటించకపోతే పోలీసు ఉన్నతాధికారుల వాహనాలకూ ఫైన్లు వేయడం వంటి విషయాలు కూడా జరుగుతుంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో వాటి ఫొటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. హాఫ్ హెల్మెట్ ధరించినందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మరో పోలీసుకు జరిమానా విధించారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫైన్ వేసిన ఆ పోలీసు తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. స్పాట్‌కు రెస్క్యూ టీమ్!
బెంగళూరు ఆర్ టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ఓ గేర్ లెస్ స్కూటర్‌ను నడుపుతున్నారు. అయితే ఆ సమయంలో ఆయన ఆ సిటీ రోడ్ లలో నిషేధంలో ఉన్న హాఫ్ హెల్మెట్ ధరించి ఉన్నారు. దీనిని గమనించిన మరో పోలీసులు ఆయన వాహనాన్ని ఆపారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ పోలీసులకు ఫైన్ విధించారు. ఈ ట్రాఫిక్ చలాన్ జారీ చేసిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆర్టీ నగర్ ట్రాఫిక్ పోలీస్ అనే ట్విట్టర్ పేజీలో ఆయన ‘‘గుడ్ ఈవినింగ్.. పోలీసులపై హాఫ్ హెల్మెట్ కేసు బుక్’’ అని క్యాప్షన్ పెట్టి ఫొటో అప్ లోడ్ చేశారు.
దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని విడిచిపెట్టకుండా పోలీసులు తీసుకున్న చర్యను నెటిజన్లు ప్రశంసించారు. ఓ యూజర్ ‘‘ఆయన చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఎంత గొప్ప ఫొటో ఇది. ’’ కామెంట్ చేశారు. మరో యూజర్ ‘‘ సార్ ఇలాంటివి ఇంకా ఎక్కువ చేయాలి. చాలా మంది పోలీసులు హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తున్నారు. ఇతర పోలీసులు కూడా వారిని వెళ్లనివ్వడం నేను చూశాను.’’ అని ఆయన పేర్కొన్నారు.
మరో యూజర్ ‘‘ నియమాలు అందరికీ ఉంటాయి. ట్రాఫిక్‌రూల్స్‌ని అనుసరించండి. హెల్మెట్ ధరించండి. ’’అని కామెంట్ చేశారు. ఇంకో యూజర్ ఇది పబ్లిసిటీ స్టంట్ అని వ్యాఖ్యానించారు. ఫొటోలో నవ్వుతున్న పోలీసును చూసి, కొంతమంది వినియోగదారులు దీనిని ఫోటో సెషన్ అని కామెంట్స్ చేస్తున్నారు.
కొడుకు వైద్యం కోసం వస్తే 60యేళ్ల మహిళతో బలవంతంగా కూలీపని.. ఆగ్రాలోని ఆస్పత్రి నిర్వాకం...
ఇదిలా ఉండగా మరో ఘటనలో ఓ వీధిలో స్కూటీ నడుపుతుండగా హెల్మెట్ ధరించలేదని బెంగళూరు పట్టణవాసికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. ఈ జరిమానాకు సంబంధించిన మెసేజ్ ఆయన ఫోన్ కు వచ్చింది. దీంతో తాను అసలు హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపలేదని ఆయన ట్విట్టర్ ఆ ఫొటో పెట్టి పోలీసు డిపార్ట్ మెంట్ కు సవాల్ విసిరాడు. దీంతో బెంగుళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. ఆయన హెల్మెట్ లేకుండా బిజీగా ఉన్న రహదారిపై బైక్ నడుపుతున్నట్లు స్పష్టంగా కనిపించే ఫొటో ఆయనకు సమాధానం ఇచ్చారు.
