Asianet News TeluguAsianet News Telugu

జమ్ము కశ్మీర్‌లో మరో పౌరుడి దుర్మరణం.. ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ఘటన

జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు తీవ్రంగా జరుగుతున్నాయి. తాజాగా, ఈ రోజు ఉదయం షోపియాన్‌ జిల్లాలో ఉగ్రవాదులకు సీఆర్‌పీఎఫ్ బలగాలకు మధ్య కాల్పలు జరిగాయి. ఈ కాల్పుల్లో చిక్కుకున్న ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయాడు.
 

one civilian killed in cross firing in jammu kashmir
Author
Srinagar, First Published Oct 24, 2021, 12:40 PM IST

శ్రీనగర్: Jammu Kashmir రక్తసిక్తమవుతున్నది. కొద్ది రోజులుగా నెత్తురోడుతూనే ఉన్నది. తాజాగా, Terroristలతో జరిగిన కాల్పుల్లో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. Shopian జిల్లా జైనపొరాలోని బాబపొరాలో ఈ ఘటన జరిగింది. 

ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ప్రాంతానికి CRPF బృందాలు ఈ రోజు ఉదయం వెళ్లాయి. అక్కడికి చేరగానే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వారిని ప్రతిఘటించే క్రమంలో సీఆర్‌పీఎఫ్ కూడా ఎదురుకాల్పులు చేసింది. ఉగ్రవాదులకు, సీఆర్‌పీఎఫ్ బలగాలకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో ఓ స్థానిక పౌరుడు మధ్యలో చిక్కుకుని బుల్లెట్లు దిగి మరణించాడు.

షోపియన్ ఎస్ఎస్‌పీ ప్రకారం, ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు 178 బెటాలియన్ నాకా పార్టీపై కాల్పులు జరిపారు. సీఆర్‌పీఎఫ్ ఎదరుకాల్పులు చేసింది. ఇందులో ఓ వ్యక్తి మరణించాడని వివరించారు.

Also Read: కశ్మీర్‌లో ఉగ్రవాదం.. పౌర హత్యలపై సమాధానమివ్వండి.. అమిత్ షా భేటీలో వీటిపైనే చర్చ

మృతి చెందిన వ్యక్తి వివరాలను వెలుగులోకి వచ్చాయి. ఎజాజ్ అహ్మద్ తనయుడు షాహిద్ అహ్మద్‌గా మృతుడిని గుర్తించారు. అతను బిజ్‌బెహారాలో పాల వ్యాపారం చేసుకుంటున్నాడని పేర్కొన్నారు.

కాగా, ఆదివారం పూంచ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

అధికారుల ప్రకారం, పాకిస్తాన్‌కు చెందిన లష్కర్ ఏ తాయిబా సంస్థ సభ్యుడు డిటెన్యూ జియా ముస్తఫా ద్వారా ఇతర ఉగ్రవాద ముఠాలను కనుగొనడానికి ప్రయత్నించారు. ఆ ఉగ్రవాదిని తీసుకుని భాటా డూరియన్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడి వెళ్లగానే ఉగ్రవాదులు విచక్షారహిత కాల్పులకు తెగబడ్డారు. ఇందులో ముగ్గురు జవాన్లు ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి అమరులయ్యారు. వెంట తీసుకెళ్లిన డిటెన్యూ జియా ముస్తఫాకూ గాయాలయ్యాయి. కాల్పులు తీవ్రంగా సాగడంతో ముస్తఫాను తిరిగి వెనక్కి తేలేకపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios