న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపుతిరుగుతోంది. అక్రమంగా తమ ఫోన్లను ట్యాపింగ్ చేశారని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈ విషయమై రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నివేదిక కోరింది.

సచిన్ పైలెట్ వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ ఈ నెల 17వ తేదీన సస్పెండ్ చేసింది. భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ లను పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను కూడ రద్దు చేసింది. 

also read:ఆడియో టేపుల కలకలం: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో వీరిద్దరూ ఎమ్మెల్యేలు ఫోన్ లో మాట్లాడినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.  ఆశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర మంత్రితో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫోన్ లో మాట్లాడారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విషయమై ఏసీబీ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు  జారీ చేసింది.

ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఫోన్ ట్యాపింగ్ విషయమై కేంద్రం రాజస్థాన్ ప్రభుత్వాన్ని నివేదక కోరింది.ఈ ఆడియో టేపుల్లోని గొంతు తనది కాదని కేంద్ర మంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఏ విచారణకైనా తాను సిద్దమని ఆయన తేల్చి చెప్పారు.రాష్ట్రంలో రాజకీయ నేతల ఫోన్లను గెహ్లాట్ ప్రభుత్వం ట్యాప్ చేసిందనే విషయమై విచారణకు బీజేపీ ఈ నెల 18వ తేదీన డిమాండ్ చేసింది.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రామాణికి ఆపరేటింగ్ విధానాన్ని అనుసరించారా, రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమను తాము రక్షించుకొనేందుకు రాజ్యాంగ విరుద్దమైన మార్గాలను అనుసరించిందా చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.