సారాంశం

ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో అక్కడ భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో వున్నందున ఇక్కడి వారి కుటుంబ సభ్యులు తమ వారి క్షేమ సమాచారం కోసం ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా అక్కడి పరిస్ధితిని పర్యవేక్షిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. 

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపుదాడితో ఇజ్రాయెల్ ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ఆపరేషన్ మొదలెట్టింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్, హమాస్‌లకు తోడుగా సంస్థలు, దేశాలు వచ్చి చేరే అవకాశం వుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచం కలవరపాటుకు గురవుతోంది. అన్ని దేశాలు ఇజ్రాయెల్‌లోని తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో వున్నందున ఇక్కడి వారి కుటుంబ సభ్యులు తమ వారి క్షేమ సమాచారం కోసం ఆందోళనకు గురవుతున్నారు. 

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌లోని భారతీయుల గురించి తనకు రాత్రి పలు సందేశాలు వచ్చాయన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా అక్కడి పరిస్ధితిని పర్యవేక్షిస్తుందని మీనాక్షి చెప్పారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్ధులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. 

ALso Read : ప్రతీకారం తీర్చుకుంటున్న ఇజ్రాయెల్ దళాలు.. హమాస్ ఉగ్రవాదులపై మొదలైన కాల్పులు..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, కరోనా వైరస్ సంక్షోభం సమయాల్లో భారతదేశం తన పౌరులను విదేశాల నుంచి విజయవంతంగా రెస్క్యూ చేసిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఆపరేషన్ గంగా, వందే భారత్ మిషన్ సమయాల్లో తాము ప్రతి ఒక్కరినీ తీసుకొచ్చామని మీనాక్షి లేఖి తెలిపారు. భారత ప్రభుత్వం, పీఎంవో స్వయంగా వారితో టచ్‌లో వుందని ఆమె వెల్లడించారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌పై హమాస్ ప్రయోగించిన రాకెట్ దాడుల్లో మరణించిన వారికి మీనాక్షి సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోడీ ఇప్పటికే తన సంతాపాన్ని తెలియజేసి ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారని కేంద్ర మంత్రి చెప్పారు. 

పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల దాడి నేపథ్యంలో శనివారం దేశంలో ఇజ్రాయెల్ అత్యవసర పరిస్ధితిని ప్రకటించింది. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌ పట్టణాలలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు పదుల సంఖ్యలో ప్రజలను హతమార్చారు. శనివారం యూదుల సెలవుదినం సందర్భంగా ఇతరులను సైతం అపహరించారు. అటు ఆదివారం ఇజ్రాయెల్ తన ప్రతీకారదాడులను ఉద్దృతం చేసింది. ఈ సందర్భంగా 400 మందికిపైగా మరణించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సైతం ఉగ్రవాదులు తప్పు చేశారని .. దీనికి తగిన శిక్ష అనుభవిస్తారని స్పష్టం చేశారు.