ప్రతీకారం తీర్చుకుంటున్న ఇజ్రాయెల్ దళాలు.. హమాస్ ఉగ్రవాదులపై మొదలైన కాల్పులు..
ఇజ్రాయిల్ పై పాలస్తీనా దాడికి ఆ దేశం ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. గాజాలో హమాస్ దళాలపై ఇజ్రాయిల్ దళాలు కాల్పులు ప్రారంభించాయి. దీంతో తిరిగి హమాస్ మిలిటెంట్ గ్రూప్ కూడా ఎదురు కాల్పులు మొదలుపెట్టాయి.
ఇజ్రాయెల్ పై ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేసిన 24 గంటల తర్వాత బాధిత దేశం ప్రతీకార చర్యలకు పూనుకుంది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ పై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు మొదలుపెట్టాయి. దీంతో హమాస్ దళాలు కూడా ఎదురు కాల్పులు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాల్లో రక్తసిక్తంగా మారిపోయాయి.
‘ఇండియా టుడే’ నివేదిక ప్రకారం.. లెబనాన్ ఇస్లామిక్ గ్రూప్ హిజ్బుల్లా ఆదివారం ఇజ్రాయెల్ పోస్టులను టార్గెట్ గా చేసుకుంది. దీంతో ఉత్తర ఇజ్రాయెల్ నుంచి మోర్టార్ షెల్లింగ్ ప్రారంభమైంది. లెబనాన్ పై ఫిరంగి దాడులు, సరిహద్దుకు సమీపంలోని హిజ్బుల్లా పోస్ట్ పై డ్రోన్ దాడితో ఇజ్రాయిల్ దళాలు ప్రతిస్పందించాయి. ఈ విషయాన్నిఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
శనివారం ఉదయం పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆకస్మిక దాడి, తాజాగా ఇరు దేశాల దళాల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఇజ్రాయెల్, పాలస్తీనా రెండింటిలోనూ ఇప్పటివరకు సుమారు 500 మంది మరణించారు. ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాల్లో తమ ఫైటర్లు ఇంకా భీకర ఘర్షణల్లో పాల్గొంటున్నారని హమాస్ సాయుధ విభాగమైన ఖాస్సం బ్రిగేడ్స్ తెలిపింది.
తాజా నివేదికల ప్రకారం.. హమాస్ దళాల దాడి వల్ల ఇజ్రాయెల్ లో 300 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రారంభించిన ప్రతీకార సైనిక చర్య, ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ వల్ల గాజాలో 313 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 613 కు చేరుకుంది. కాగా.. గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్ లోని పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ తో తమ సైనికులు ఇంకా పోరాడుతున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) తెలిపింది. గాజా స్ట్రిప్ కు సరిహద్దుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతాలలో ఒఫాకిమ్, స్డెరోట్, యాద్ మోర్డెచాయ్, ఖార్ అజ్జా, బెరీ, యాతిద్, కిసుఫిమ్ లతో సహా ఘర్షణలను హమాస్ ధృవీకరించింది.
కాగా.. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ నుంచి మోర్టార్ షెల్లింగ్ జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని లెబనాన్ ఇస్లామిక్ గ్రూప్ హిజ్బుల్లా ప్రకటించింది. హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు రాకెట్లతో ప్రతీకారం తీర్చుకున్నాయి. లెబనాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని ప్రజలు బాంబు షెల్టర్లకు దగ్గరగా ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా.. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా సిటీలోని వతన్ టవర్, అల్-అక్లౌక్ టవర్, మతార్ నివాస భవనం సహా మరిన్ని నివాస భవనాలు దెబ్బతిన్నాయి.