Omicron: దేశంలో 3 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు
coronavirus: దేశంలో కరోనా వైరస్ విజృంభణ మొదలైంది. ఒక్కరోజే ఏకంగా లక్షలకు పైగా కొత్త కేసులు నమోదుకావడంపై సర్వ్రతా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు సైతం పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 3 వేలు దాటాయి.
Omicron cases in India: చాలా దేశాల్లో కరోనా కల్లోలం రేపుతున్నది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్ పంజా విసురుతోంది. దీనికి తోడూ కొత్తగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ .. అన్ని వేరియంట్లను మించి విజృంభిస్తోంది. దీంతో ఒమిక్రాన్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ లోనూ కొత్త వేరియంట్ కేసులు అధికమవుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,007 కి చేరింది. శుక్రవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. ఇప్పటివరకు దేశంలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ బారినపడ్డవారి సంఖ్య 3007కు పెరిగింది. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 465, కర్నాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114, తెలంగాణలో 107, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 28, పశ్చిమ బెంగాల్‌లో 27 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కొత్త వేరియంట్ బారినపడ్డవారిలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారినపడ్డ వారిలో 1,199 మంది రికవరీ అయ్యారు. అయితే, ఇప్పటికీ.. వందల సంఖ్యలో జీనోమ్ సిక్వెన్సింగ్ సెంటర్ల వద్ద వేచివున్నాయని విశ్వసనీయ సమాచారం. మరికొన్ని రోజుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో రోజువారి కేసులు లక్షకు పైగా నమోదుకావడానికి ప్రధాన కారణం ఒమిక్రాన్ వేరియంటేనని అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రన్ చాపకింద నీరులా వ్యాప్తిస్తూ.. అంతకంతకూ విస్తరిస్తోంది. దీంతో వచ్చే నెల రోజుల్లో ఒమిక్రాన్ పంజా విసరడం ఖాయమని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ఇదిలావుండగా, ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా దేశంలో సాధారణ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కోంటున్నారు. దీని కారణంగానే కొత్త కేసులు రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయని తెలుపుతున్నారు. కాగా, గత 24 గంటల్లో దేశంలో భారీగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏకంగా లక్షకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం గతేడాది జూన్ తర్వాత ఇదే మొదటిసారి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,17,100 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 302 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు సైతం మూడు లక్షలకు పైగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 3,71,363 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొత్తగా కోవిడ్ మహమ్మారి నుంచి 30,836 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,43,71,845 కు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనాకేసులు 3,52,26,386 నమోదుకాగా, ఇందులో 4,83,178 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా రికవరీ రేటు 97.6 శాతంగా ఉంది. మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.