వందే భారత్ ట్రైన్‌ను పాత రైల్ ఇంజిన్ లాక్కెళ్లుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను చూపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై నెటిజన్లు విమర్శలు సంధించారు. దీంతో రైల్వే శాఖ వివరణ ఇచ్చింది.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వందే భారత్ ట్రైన్‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోడీ స్వయంగా పలు రాష్ట్రాలు పర్యటించి ఈ ట్రైన్‌లను ప్రారంభిస్తున్నారు. ఎన్నికల క్యాంపెయిన్‌లో బీజేపీ తరుచూ డబుల్ ఇంజిన్ సర్కార్ అనే మాటను ఉపయోగిస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కారు వేగంగా పరుగులు పెడుతుందని, రాష్ట్ర అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని చెబుతూ ఉంటుంది. ఈ వ్యాఖ్యానానికి అంతర్లీనంగానే మోడీ స్వయంగా వందే భారత్ ట్రైన్‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభిస్తున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. వందే భారత్ ట్రైన్‌ను ఓ పాత రైల్ ఇంజిన్ వేగంగా లాక్కెళ్లుతున్న వీడియోపై సోషల్ మీడియాలో విమర్శనాత్మక వ్యాఖ్యలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా రైల్వే శాఖ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
తాము భారత్ ఎన్నడూ చూడని వేగవంతమైన ట్రైన్‌లను ప్రవేశపెడుతున్నామని మోడీ ప్రభుత్వం చెప్పిందని, కానీ, కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పాత రైల్ ఇంజిన్ ఆ ట్రైన్‌లను లాక్కెళ్లుతున్నాయని నెటిజన్లు విమర్శలు చేశారు. తొమ్మిదేళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళ్లుతున్నదంటూ పదునైన కామెంట్లు చేశారు. దీంతో ఈ వీడియోపై ఈస్ట్ సెంట్రల్ రైల్వే రియాక్ట్ అయింది.
ఆ వీడియో కనిపిస్తున్న వందే భారత్ రైలు ఇంకా సేవల్లోకి రాలేదని స్పష్టం చేసింది. దాన్ని ఇంకా ప్రారంభించలేదని వివరించింది. దాని రూట్ కూడా ఖరారు కాలేదని తెలిపింది. రూట్ ఖరారైతేనే లోకో పైలట్లు, సిబ్బంది కేటాయింపు జరుగుతుందని వివరించింది.
