పెట్రోల్ బంక్ లో పనిచేసే ఉద్యోగుల కులం, మతం వివరాలతో సంబంధం ఏంటి..? బంక్ డీలర్లు ఇలానే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే.. పెట్రోలు బంకులో పనిచేసే ఉద్యోగి కులమేమిటి? అతను ఏ మతస్తుడు? ఏ నియోజకవర్గానికి చెందినవాడు?... కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలన్నీ సేకరిస్తోంది. ఇలాంటి వ్యక్తిగత సమాచారం ఎందుకు పంపించాలంటూ పెట్రోలియం డీలర్లు నిరాకరిస్తున్నారు. 

వివరాలు పంపాలంటూ ప్రభుత్వరంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, బీపీసీఎల్‌లు 6.6.2018నే 59వేల మంది డీలర్లకు లేఖలు రాశాయి. బంకుల్లో దాదాపు పది లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టిన ‘తొలి చదువుల గుర్తింపు’ (ఆర్‌పీఎల్‌) విధానం కింద ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నట్టు ఆ లేఖలో తెలిపాయి. 

దాని ఆధారంగా ధ్రువపత్రం ఇస్తామని, అది తదుపరి చదువులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఉద్యోగి ఆధార్‌ సంఖ్య, కులం, మతం, నియోజకవర్గం వివరాలు అడగడమేమిటని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. సమాచారం పంపనందున ఇంధనాల సరఫరా నిలిపివేస్తామని పంజాబ్‌లోని ఇండియన్‌ ఆయిల్‌ అమ్మకాల అధికారి ఒకరు డీలర్లకు సందేశం పంపారు. 

దీనిపై పంజాబ్‌లోని డీలర్లు ఆందోళనకు దిగి లీగల్‌ నోటీసు పంపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2015-18 మధ్య 29 లక్షల మందికి శిక్షణ ఇవ్వగా, అందులో 6లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. పది లక్షల మంది పెట్రోలియం బంకుల ఉద్యోగులు కూడా లబ్ధి పొందారని చెప్పడానికే అన్ని వివరాలు అడిగినట్టు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.