ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం.. ప్రధాని మోదీ
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ ప్రమాదానికి కారకులుగా తేలినవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్టుగా ప్రధాని మోదీ తెలిపారు. ఈ ప్రమాదానికి కారకులుగా తేలినవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. రైలు ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, విపత్తు సహాయక దళాల సిబ్బంది, రైల్వే అధికారులతో ప్రధాని మాట్లాడారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ బాలసోర్‌లోని ఆస్పత్రిలో బయలుదేరి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన మోదీ.. వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. గాయపడిన వారి చికిత్స కోసం ప్రభుత్వం అందుబాటులో అన్ని సౌకర్యాలను వినియోగిస్తుందని తెలిపారు. ఇది తీవ్రమైన సంఘటన అని.. అన్ని కోణాల నుంచి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయబడ్డాయని చెప్పారు. ప్రమాదానికి కారణమైనవారిని క్షమించమని అన్నారు. దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తారని తెలిపారు. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణకు కృషి చేస్తున్నారని చెప్పారు. గాయపడినవారిని ఆస్పత్రిలో తాను కలిశానని చెప్పారు. రైలు ప్రమాద బాధితులకు సహాయం అందించిన స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంది యువకులు రక్తదానానికి ముందుకొచ్చారని చెప్పారు. వ్యవస్థలను మరింత సురక్షితం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందిస్తామని చెప్పారు.
ఇక, ప్రధాని మోదీ వెంటే కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్‌లతో పాటు పలువురు రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రమాదానికి సంబంధించి వివరాలను కేంద్ర మంత్రులు, అధికారులు.. ప్రధాని మోదీకి వివరించారు.
ఇదిలా ఉంటే, ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. అక్కడి నుంచే క్యాబినెట్ సెక్రటరీ, ఆరోగ్య మంత్రితో ఫోన్‌లో మాట్లాడారు. క్షతగాత్రులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తూ ఉండాలని ఆయన అన్నారు.