Odisha Train Accident: మూడు వెబ్‌సైట్లలో రైలు ప్రమాద మృతుల, క్షతగాత్రుల ఫొటోలు..
ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు.
ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ప్రమాద బాధితుల్లో పలు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. వీరిని గుర్తుపట్టే ప్రక్రియ కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే రైల్వే ప్రమాద బాధితులను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఒడిశా ప్రభుత్వం మూడు వెబ్‌సైట్లలో ప్రయాణికుల సమాచారాన్ని పోస్ట్ చేసింది. వెబ్‌సైట్‌లు https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న ప్రయాణీకుల జాబితాలను కలిగి ఉంటాయి. అలాగే మరణించిన ప్రయాణీకుల జాబితా, చిత్రాలను కూడా ఈ వెబ్‌సైట్‌లలో ప్రచురించారు.
‘‘బాలాసోర్ రైలు ప్రమాదంలో మరణించిన వారి ఛాయాచిత్రాలు కేవలం గుర్తింపు కోసం పోస్ట్ చేయబడుతున్నాయి. ప్రమాదం తీవ్రత దృష్ట్యా పోస్ట్ చేయబడిన చిత్రాలు కలవరపెడుతున్నాయి’’ అని ఒక అధికారి తెలిపారు. పిల్లలు ఈ చిత్రాలను చూడకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఒడిశాలోని స్పెషల్ రిలీఫ్ కమీషనర్ ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఎవరూ (మీడియా/వ్యక్తిగతం/సంస్థలు మొదలైనవి) చిత్రాలను ప్రచురించకూడదని పేర్కొన్నారు.
Also Read: మానవ తప్పిదమా , విద్రోహమా .. ఒడిషా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ : అశ్విని వైష్ణవ్
ఇక, భువనేశ్వర్ మున్సిపల్ కమీషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా చికిత్స పొందుతున్న వారి వివరాలు, మృతుల వివరాలు, మృతదేహాల గుర్తింపు కోసం సమాచారం, సహాయాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు. మూడు వెబ్‌సైట్లలోని లింక్ ద్వారా కూడా రైలు ప్రమాద మృతులను గుర్తించవచ్చని పేర్కొన్నారు.
ఇక, యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఒడిషా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ జరపనుంది. రైల్వే బోర్డు సిఫారసు మేరకు ఈ ప్రమాదంపై విచారణ జరపాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీబీఐని కోరారు. సిగ్నల్ మారడం వెనుక కుట్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. కోరమండల్‌ను కావాలనే లూప్‌లైన్‌లోకి మార్చారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బహనాగ స్టేషన్ మేనేజర్‌ను కూడా అధికారులు విచారించారు. బహనాగ స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నలింగ్ రూమ్‌లో సీసీ కెమెరాలను పరిశీలించారు.