ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 280 మంది మృతిచెందినట్టుగా చెబుతున్నారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మూడు రైళ్లు (రెండు ప్యాసింజర్, ఒక్క గూడ్స్ రైలు) ప్రమాదానికి గురైన ఘటనలో ఇప్పటివరకు 280 మంది మృతిచెందినట్టుగా చెబుతున్నారు. 900 మందికి పైగా గాయపడ్డారు. రైలు ప్రమాద ఘటన స్థలంలో యుద్దప్రతిపాదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలంలో వాతావరణం భీతావహంగా ఉంది. ఎటూ చూసిన మృతదేహాలు.. హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. రైలు బోగీల్లో మరింత మంది ప్రయాణికులు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ఘోర రైలు ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

అయితే అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6.50 నుంచి 7.10 గంటల మధ్య నిమిషాల వ్యవధిలో ఈ భారీ విషాదం చోటు చేసుకుంది. అధికారుల ప్రకారం.. 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ షాలిమార్ స్టేషన్ నుండి మధ్యాహ్నం 3:20 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:30 గంటలకు బాలాసోర్ చేరుకుంది. రాత్రి 7 గంటల సమయంలో బాలేశ్వర్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన బోగీలు ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. అదే సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు అక్కడే లూప్ ట్రాక్‌లో నిలిచి ఉంచిన గూడ్స్ రైలు‌పై కూడా పడిపోయాయి.

అయితే ఎదురుగా ఉన్నట్రాక్‌పై ప్రయాణిస్తున్న.. 12864 బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొట్టింది. దీంతో బెంగళూరు-హౌరా సూపర్‌పాస్ట్ రైలులోని మూడు నాలుగు బోగీలు ప్రమాదానికి గురయ్యాయి. ఇక, ‘‘రెండు ప్యాసింజర్ రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంతో అక్కడే నిలిచి ఉంచిన గూడ్స్ రైలు కూడా ప్రమాదంలో పడింది’’ అని ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ ఏఎఫ్‌పీ చెప్పారు. 

Also Read: Odisha Train Accident: నేడు ఒడిశాకు ప్రధాని మోదీ.. రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్న ప్రధాని..

మరో వెర్షన్ ప్రకారం.. హౌరా వైపు ప్రయాణిస్తున్న 12864 బెంగుళూరు-హౌరా రైలులోని అనేక కోచ్‌లు బాలాసోర్ సమీపంలోని బహనాగ బజార్ వద్ద పట్టాలు తప్పాయి. ఆ బోగిలు పక్కనే ఉన్న ట్రాక్‌లపై పడిపోయాయి. ఈ పట్టాలు తప్పిన కోచ్‌లు 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు కూడా బోల్తా పడ్డాయి. పట్టాలు తప్పిన తర్వాత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు.. అక్కడే మరో ట్రాక్‌పై ఉన్న నిలిచిఉంచిన గూడ్స్ రైలును ఢీకొట్టడంంతో.. అది కూడా ప్రమాదంలో చిక్కుకుందని స్థానిక అధికారులు చెబుతున్నారు. 

అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించి రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఇక, ఈ ప్రమాదం కోల్‌కతాకు దక్షిణాన 250 కిలోమీటర్లు, భువనేశ్వర్‌కు ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలో బాలాసోర్ జిల్లాలోని బహంగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగాయి.