భార్యకు పురిటినొప్పులతో బాధపడుతోందని హాస్పిటల్ కి తీసుకువచ్చాడు. అప్పటికే భార్యతో అతను కాకుండా మరో ఐదుగురు కుటుంబసభ్యులు వెంట ఉన్నారు. కాగా.. ఆమెను అత్యవసరంగా ప్రసూతి వార్డుకు తరలించారు. అయితే.. తనను కూడా అక్కడికి అనుమతించాలంటూ సదరు గర్బిణీ భర్త నానా హంగామా చేశాడు. అందుకు అనుమతించలేదని ఏకంగా డాక్టర్ చెవి కొరికేశాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మపుర మహారాజా కృష్ణ చంద్ర గజపతి వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.  గంజాం జిల్లా పురుషోత్తంపూర్ ప్రాంతానికి చెందిన తరుణి ప్రసాద్ మహాపాత్ర తన భార్యను కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఆమె వద్ద అప్పటికే ఐదుగురు కుటుంబసభ్యులు ఉన్నారు.

అయినప్పటికీ తనను కూడా ప్రసూతి వార్డులోకి అనుమతించాలని తరుణి ప్రసాద్ గొడవ చేయడం మొదలుపెట్టాడు. అయితే.. అందుకు డాక్టర్లు అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి వైద్యుడిపై దాడి చేశాడు. అనంతరం అక్కడే ఉన్న మరో నలుగురు వైద్యులపై దాడి చేసి... ఓ డాక్టర్ చెవి కూడా కొరికేశాడు. కాగా.. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.