శనివారం రాత్రి మహారాష్ట్ర, గుజరాత్‌లలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశంలో కొన్ని వస్తువులు ఉల్కల వలే వేగంగా ప్రయాణిస్తూ కనిపించాయి. చాలా మంది వాటిని తమ ఫోన్‌లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దానిపై పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. అంతేకాదు, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో కొన్ని చోట్ల వీటి అవశేషాలు లభ్యం కావడంతో అవి ఏమై ఉంటాయా? అనే వాదనలు ముందుకు వచ్చాయి. వాటిపై నిపుణులు ఇలా స్పందించారు.
ముంబయి: శనివారం రాత్రి ఉన్నట్టుండి నల్లటి చీకటి రాత్రిలో ఆకాశంలో ఉన్నట్టుండి నిప్పు రవ్వల తరహాలో కొన్ని వస్తువులు మంటలు చిమ్ముతూ దూసుకెళ్లాయి. చూస్తుండగానే అవి మాయం అయిపోయాయి. చాలా వేగంగా పోటీ పడ్డట్టుగానే ఆ వస్తువులు ఆకాశంలో పరుగులు పెట్టాయి. ఆ దృశ్యాలు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. చాలా మంది వాటిని చూసి ఆశ్చర్యపడ్డారు. మరికొందరు భయాందోళనలకు గురయ్యారు. కాగా, ఆ వస్తువులను వీడియో తీసి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ గుర్తు తెలియని వస్తువులపై చర్చ మొదలైంది.
అనంతరం మరో విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో కొన్ని చోట్ల ఇనుప రింగ్, సిలిండర్ ఆకారంలో మరికొన్ని వస్తువులు నేలపై పడి ఉండటాన్ని స్థానికులు చూశారు. ఈ విషయంపై అధికారులూ స్పందించారు. చంద్రాపూర్ జిల్లా కలెక్టర్ అజయ్ గుల్హనే వీటి గురించి న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు. సిందేవాహి తెహసీల్‌కు చెందిన లద్బోరి గ్రామంలో ఇవి నేలపై పడి ఉన్నట్టు స్థానికులు శనివారం రాత్రి 7.50 గంటలకు గుర్తించారని వివరించారు. అంతకు ముందు అక్కడ అలాంటి వస్తువులు లేవని స్థానికులు చెప్పినట్టు తెలిపారు. ముంబయిలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేసినట్టు పేర్కొన్నారు. కేవలం లద్బోరి గ్రామంలోనే కాదు, అదే తెహసీల్‌కు చెందిన పవన్‌పార్ గ్రామంలోనూ సిలిండర్ వంటి వస్తువులు గుర్తించినట్టు వివరించారు.
ఒక ఫీట్ నుంచి 1.5 ఫీట్ వ్యాసంతో ఆ వస్తువులు ఉన్నాయని కలెక్టర్ అజయ్ గుల్హనే తెలిపారు. కాగా, వాటిని పరిశీలించడానికి సేకరించినట్టు వివరించారు. అంతేకాదు, ఇలాంటి వస్తువులు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ పడి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి, ఇతర గ్రామాల్లోనూ ఇలాంటి వస్తువులు పడి ఉంటే గుర్తించడానికి జూనియర్ రెవెన్యూ అధికారులను గ్రామాలకు పంపినట్టు వివరించారు.
లద్బోరి గ్రామంలో శనివారం సాయంత్రం 7.45 గంటలకు అల్యూమినియం, స్టీల్ వస్తువులు పడ్డట్టు అధికారులు చెప్పారు. బుల్దానా, అకోలా, జల్గావ్ జిల్లాల్లోనూ ఇలాంటి వస్తువులను రాత్రి 7.30 గంటల ప్రాంతంలోనూ రిపోర్ట్ చేసినట్టు వివరించారు. మహారాష్ట్రతోపాటు మధ్యప్రదేశ్‌లోని బర్వానీ, భోపాల్, ఇండోర్, బేతుల్, ధార్ జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు రిపోర్ట్ అయ్యాయి.
ఈ వస్తువులపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే నిపుణులు ఏమంటున్నారనే ఆసక్తి మొదలైంది. నిపుణులు వీటిపై రెండు రకాల సమాధానాలు చెబుతున్నారు. ఒకటి అంతరిక్షంలోని వస్తువులు (మిటీయరైట్స్) ఇలా భూ వాతావరణంలోకి వచ్చాయని తెలిపారు. సాధారణంగా అలాంటి వస్తువులు భూ వాతావరణంలోకి రాగానే వాటి వేగానికి మాడి మసై పోతుంటాయి. వాటి వేగానికి అవి మంటలు చిమ్ముతూ చాలా వరకు ఆకాశంలోనే బూడిదై పోతాయి. చాలా అరుదుగా మాత్రమే అవి నేలను చేరతాయి. చేరినా.. మంటల కారణంగా నల్లబడిపోయి ఉంటాయి. ఇక మిటీయరైట్స్ కాకుండా మరో వాదననూ నిపుణులు ముందుకు తెస్తున్నారు.
గతేడాది ఫిబ్రవరిలో చైనా చాంగ్ జెంగ్ 5బీ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. కానీ, ఆ రాకెట్‌కు సంబంధించిన అవశేషాలే ఇలా తిరిగి భూమిలోకి ప్రవేశించాయని ఇంకొందరు నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రాకెట్‌ను లాంచ్ చేసిన తర్వాత కొన్ని దశల్లో దానికి ఉండే బూస్టర్లు రాకెట్‌తో విడివడుతాయి. ఆ బూస్టర్లే తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించాయని పేర్కొంటున్నారు. అయితే, వీటితో ముప్పు చాలా తక్కువగా ఉంటుందని వివరించారు. ఎందుకంటే చాలా వరకు రాకెట్ బూస్టర్లు తిరిగి భూ వాతావరణంలోకి మంటలు మండుతూ ప్రవేశిస్తాయని, అవి భూమిని చేరడం చాలా తక్కువ సందర్భాల్లో చోటుచేసుకుంటాయని తెలిపారు.
అంతేకాదు, యూఎస్ వ్యోమగామి ఒకరు ఈ పరిణామాన్ని ముందుగానే అంచనా వేశారు కూడా. చైనీస్ రాకెట్ స్టేజ్ రీఎంట్రీలో భాగంగా అంటే థర్డ్ స్టేజ్‌లో చాంగ్ జెంగ్ 3బీ సీరియస్ నెంబర్ వై77 అవశేషాలే వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ రాకెట్‌ను 2021 ఫిబ్రవరిలో లాంచ్ చేశారని పేర్కొన్నారు. ఇవి కొన్ని గంటల్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నందున వాటిని ట్రాక్ చేయడం మంచిదనీ ట్వీట్ చేయడం గమనార్హం.
