సీమాంతర ఉగ్రవాదం, ఐఎస్‌ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాదం మానవాళికి ముప్పుగా వాటిల్లుతోందని  జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పేర్కొన్నారు. 

భారతదేశం, ఇండోనేషియా మధ్య పరస్పర శాంతి, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడంలో ఉలేమా పాత్రను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం ప్రశంసించారు.ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ..రెండు దేశాలు (ఇండియా మరియు ఇండోనేషియా)ఉగ్రవాదం, వేర్పాటువాదానికి గురవుతున్నాయని అన్నారు. ఇరుదేశాలు ఇప్పటికే పలు సవాళ్లను అధిగమించినప్పటికీ, సీమాంతర ఉగ్రవాదం (ISIS) ముప్పుగా తయారైందని పేర్కొన్నారు.

ఈ ముప్పును ఎదుర్కోవడంలో పౌర సమాజ సహకారం అవసరమని అన్నారు.ఉగ్రవాదం, రాడికలైజేషన్, మతాన్ని దుర్వినియోగం చేయడం ఏ మూలకైనా సమర్థనీయం కాదనీ, మతాన్ని వక్రీకరించడం సరికాదనీ, దీనికి వ్యతిరేకంగా మన గళాన్ని విప్పాల్సిన అవసరముందని అన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం ఇస్లాం అర్థానికి వ్యతిరేకమనీ, ఇస్లాం అంటే శాంతి ,శ్రేయస్సు (సలామతి/అసలాం)అని అన్నారు. మత శక్తులు ఏ మతంతోనూ ఘర్షణగా చిత్రించకూడదనీ, అది ఒక కుతంత్రమని ఆయన అన్నారు. మతాల యొక్క నిజమైన సందేశాన్ని దృష్టి పెట్టుకోవాలని, ఇది మానవతావాదం, శాంతి, అవగాహన యొక్క విలువలను సూచిస్తుందని అన్నారు. 

భూకంప బాధితులకు సంతాపం

ఈ సందర్భంగా ఇటీవల ఇండోనేషియాలో సంభవించిన భూకంపంలో మరణించిన వారికి దోవల్ సంతాపం తెలిపారు. ఇండోనేషియాలో ఇటీవల సంభవించిన భూకంపం వల్ల ప్రాణ,ఆస్తి నష్టం జరగడం వల్ల మేమంతా బాధపడ్డామని అన్నారు. భూకంప మృతులకు, వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.ఈ దుఃఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. 

వేగంగా పెరుగుతున్న సంబంధం

భారత్,ఇండోనేషియా మధ్య సంబంధాలపై మాట్లాడుతూ.. " ఇరుదేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి." అని అన్నారు. ఇరుదేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్నాయి. భారత్, ఇండోనేషియాల్లో ప్రజాస్వామ్యాలు వర్ధిల్లుతున్నాయని,ఇరుదేశాలు తమ తమ చరిత్ర, వైవిధ్యం, ఉమ్మడి సంప్రదాయాలతో ఆసియాలో శాంతి, ప్రాంతీయ సహకారం, శ్రేయస్సు పెంపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య సహకారానికి పర్యాటకం ఒక ముఖ్యమైన వారధిగా మారిందని అన్నారు.