రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా అభినందించారు.
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 కరెన్సీ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా అభినందించారు. నల్లధనం, పన్ను ఎగవేతలను అరికట్టాలన్న ప్రధాని సంకల్పం రూ.2,000 నోట్ల ఉపసంహరణతో బలపడుతుందని అన్నారు. నృపేంద్ర మిశ్రా 2014 నుంచి 2019 మధ్య ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ సమయంలోనే 2016లో రూ. రూ. 1,000, రూ. 500 (పాత సిరీస్) నోట్లను రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. దీంతో ఆ ప్రకటన, దాని వెనక ఉన్న పరిణామాల గురించి ఆయనకు చాలా విషయాలు తెలుసు.
అయితే అప్పుడు ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా ఉన్న నృపేంద్ర మిశ్రా.. ఇప్పుడు ఒక పౌరుడిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ నల్లధనం సమాంతర ఆర్థిక వ్యవస్థను మంచి ఆర్థిక నిర్వహణకు శాపంగా చూస్తారని చెప్పారు. ‘‘రోజువారీ లావాదేవీలకు 2000 రూపాయల నోట్లు ఆచరణాత్మకమైన కరెన్సీ కాదని ప్రధానమంత్రి మోదీ ఎప్పుడూ నమ్ముతారు. అంతేకాకుండా ఇది నల్లధనం ఉత్పత్తి, పన్ను ఎగవేత అభ్యాసాన్ని సులభతరం చేస్తుంది. ఆయన ఎల్లప్పుడూ తక్కువ విలువను ప్రజల కరెన్సీగా పరిగణించారు.
2000 రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రధాని మోదీ మాడ్యులర్ బిల్డింగ్ విధానాన్ని నిర్ధారిస్తుంది. ఇది రూ. 2000 నోట్లను ముద్రించడం ఆపివేయడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత క్రమంగా చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఇప్పుడు 2023 సెప్టెంబర్ 30న పూర్తిగా నిలిపివేయబడుతోంది. డీమోనిటైజేషన్‌కు సంబంధించిన తప్పుడు వదంతులతో దీనికి ఎలాంటి సంబంధం లేదు’’ అని నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు.
ఇక, భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెలామణిలో ఉన్న రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించింది. ప్రజలు రూ. 2,000 నోట్లను 2023 సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని లేదా ఇతర నోట్లలోకి మార్చుకునేందుకు అవకాశం కలిపించింది.
