న్యూఢిల్లీ: జాతీయ పౌరుల నమోదు (ఎన్నార్సీ) దేశమంతా అమలు చేయబోమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. నరేంద్ర మోడీతో ఆయన తన కుమారుడు ఆదిత్యతో కలిసి భేటీ అయ్యారు. మోడీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నార్సీని అస్సాంలో మాత్రమే అమలు చేస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా నమోదు (ఎన్పీఆర్) గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎన్నార్పీ కేవలం జానాభా లెక్కల సేకరణ మాత్రమేనని ఆయన చెప్పారు. 

మహారాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకారం అందిస్తామని మోడీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు సంబంధించిన విషయాలపై మోడీతో మంచి చర్చ జరిగిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్ధవ్ థాకరే ప్రధాని మోడీని కలవడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.

జీఎస్టీ డబ్బులను రాష్ట్రానికి వెంటనే ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. సీఏఏ, ఎన్పీఆర్ గురించి తాను కాంగ్రెసుతో మాట్లాడుతానని చెప్పారు. 

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో పాటు ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాకరే ప్రదాని నరేంద్ర మోడీని కలిశారని పీఎంవో ట్వీట్ చేసింది. వాళ్లిద్దరు మోడీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫొటోను దానికి జోడించి షేర్ చేసింది.

ఉద్ధవ్ థాకరే కాంగ్రెసు తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా కలిశారు. బిజెపి కురువృద్ధుడు ఎల్కే అద్వానీని కూడా ఆయన కలిశారు. ఉద్థవ్ కు, ప్రధానికి మధ్య మంచి సంబంధాలున్నాయని శుక్రవారం ఉదయం శివసేన నేత సంజయ్ రౌత్ చెప్పారు. వారి మధ్య అన్నాతమ్ముళ్ల సంబంధం కొనసాగుతుందని చెప్పారు.