ఇక పై ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమకు పూర్తయిన సిలబస్ ఆధారంగా పరీక్షలు రాసేలా, రాసిన విషయాల్లో ఉత్తమ స్కోర్లు సాధించినవాటిని ఎంచుకునే వెసులుబాటు విద్యార్థులకు కల్పించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. 

న్యూఢిల్లీ: విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం మరో మార్పును వెల్లడించింది. బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ ఉత్తమ స్కోర్లను ఎంచుకునే అవకాశాన్ని కల్పించనున్నట్టు వివరించింది. ఏడాదికి ఒకే పరీక్ష ఉండటం మూలంగా నెలకొనే ఒత్తిడిని తగ్గించడానికి, విద్యార్థులు తమ ఉత్తమ ప్రదర్శనను కనబరచడానికి ఉపయోగపడే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద ప్రదాన్ శుక్రవారం వెల్లడించారు.

జాతీయ విద్యా విధానం 2020కు లోబడే ఈ న్యూ కరికులం ఫ్రేమ్ వర్క్ ఉంటుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. 2024 విద్యా సంవత్సరం కోసం పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు వివరించారు. అంతేకాదు, ఇంటర్ విద్యార్థులు రెండు భాషలను చదవాలని, అందులో ఒకటి తప్పకుండా భారతీయ భాష అయి ఉండాలని చెప్పారు. ఇది దేశంలోని భాష వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడానికి ఉపకరిస్తుందని తెలిపారు.

11వ, 12వ తరగతి విద్యార్థులు రెండు భాషలను చదవాల్సి ఉంటుందని, అందులో ఒకటి భారతీయ బాష అయి ఉండాలని నేషనల్ కర్రికులం ఫ్రేమ్ వర్క్ డాక్యుమెంట్ చెబుతున్నది.

Also Read: చంద్రయాన్ 3 సక్సెస్ కావాలని పాక్ జాతీయురాలు సీమా హైదర్ ఉపవాసం (Video)

అలాగే, ప్రస్తుతమున్న ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాలు వేటికవి సంబంధం లేనట్టుగా ఉండబోవని ఈ డాక్యుమెంట్ తెలిపింది. విద్యార్థులు ఏ సబ్జెక్టులనైనా ఎంచుకోవచ్చు. విద్యార్థులు తమ సిలబస్‌కు అనుగుణంగా పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో కోర్స్ టైమ్‌లో ఆన్ డిమాండ్ పరీక్షలు నిర్వహించే స్థాయికి విద్యా సంస్థలు ఎదుగుతాయని పేర్కొంది. ఈ నిర్ణయాల ద్వారా బట్టీ చదువులకు స్వస్తి పలికి వాస్తవంలో విద్యార్థులు నేర్చుకునే విధంగా విద్యా విధానాన్ని మార్చినట్టు కేంద్రమంత్రి చెప్పారు.