దేశంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త కొత్త కేసులు పుట్టుకువస్తున్నాయి. అయితే... గోవా మాత్రం కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందిందని అందరూ భావించారు. ఇటీవలే గోవాలో మళ్లీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే.. అక్కడ కూడా మళ్లీ కరోనా తిరిగి కలకలం రేపడం గమనార్హం.

గోవాలో నిర్వ‌హించిన ర్యాపిడ్ టెస్టుల‌లో ఏడుగురికి కరోనా పాజిటివ్ ఉన్న‌ట్లు గుర్తించారు. వీరంతా ముంబై నుంచి వచ్చారు. ప్రస్తుతం వీరిని క్వారంటైన్‌లో ఉంచారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. 

కాగా గ‌డ‌చిన‌ ఏప్రిల్ 19న గోవాను కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో ఆరుగురు కోలుకున్నారు. చివరి రోగి రిపోర్టు ఏప్రిల్ 19 న నెగిటివ్‌గా వచ్చింది. ఆ తర్వాత అతను కోలుకుని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు తిరిగి పాజిటివ్ కేసులు వెలుగు చూడ‌టం గోవాలో క‌ల‌క‌లం రేపుతోంది.  నిన్నటి వరకు దేశంలో గ్రీన్ జోన్ గా ఉన్న గోవాలో మళ్లీ కరోనా కేసులు నమోదు కావడం అందరినీ కలవర పెడుతోంది.