ఇప్పుడు ఈడీ కూడా మా కోసం ఎన్నికల ప్రచారం చేస్తోంది - డీఎంకే మంత్రి నివాసాల్లో రైడ్ పై సీఎం స్టాలిన్ కామెంట్లు
ఇంత వరకు తమిళనాడు గవర్నర్ మాత్రమే తమ కోసం ఎన్నికల ప్రచారం చేశారని, ఇప్పుడు అందులో ఈడీ కూడా చేరిందని డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ అన్నారు. ఆయన మంత్రి పొన్ముడి నివాసాల్లో ఈడీ రైడ్ నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, డీఎంకే నేత పొన్ముడి, ఆయన కుటుంబానికి సంబంధించిన నివాసాల్లో మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. మంత్రి కుమారుడు, లోక్ సభ ఎంపీ గౌతమ్ సిగామణి కోసం కూడా గాలిస్తున్నారు. చెన్నై, విల్లుపురంలోని తండ్రీకొడుకుల నివాసాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ చర్యను అధికార డీఎంకే ఖండించింది. దీనిని 'రాజకీయ కక్ష సాధింపు', 'బీజేపీ చేసిన డ్రామా'గా అభివర్ణించింది.
ఈడీ సోదాలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. పొన్ముడి ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటారని, బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశానికి ముందు ఈ దాడి పక్కదారి పట్టించే ఎత్తుగడ తప్ప మరేమీ కాదని అన్నారు. గవర్నర్ ఇప్పటికే మా (డీఎంకే) కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, ఇప్పుడు ఈడీ కూడా మా కోసం ఎన్నికల ప్రచారం చేస్తోందని ఆరోపించారు. దీంతో తమకు ఎన్నికల పని సులువవుతోందని అన్నారు. ఇది సాధారణమేని తెలిపారు.
కాగా.. తమిళనాడు మంత్రి పొన్ముడిపై ఈడీ సోదాలను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఖండించారు. దర్యాప్తు సంస్థ రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈడీ ద్వారా భారత్ లాంటి గొప్ప దేశాన్ని భయపెట్టలేరని, నియంత్రించలేరని ఆయన ట్వీట్ చేశారు.
ఈడీ చర్య మమ్మల్ని భయపెట్టలేదు - డీఎంకే
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల సమావేశంలో ఎంకే స్టాలిన్ పాల్గొననున్న నేపథ్యంలో ఈడీ చర్య జరుగుతోందని డీఎంకే వ్యాఖ్యానించింది. బీజేపీని ఎదుర్కోవడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని, అయితే ఈడీ చర్య తమను భయపెట్టడమేనని పేర్కొంది. ఇది రాజకీయ కక్ష సాధింపు అని, డీఎంకే సంకల్పాన్ని పరీక్షించడమే లక్ష్యమని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎ.శరవణన్ అన్నారు.