President Election 2022: జూలైలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆ ఊహాగానాలకు పుల్ స్టాప్ పెట్టారు. తాను రాష్ట్రపతి రేసులో లేనని స్పష్టం చేశారు.
President Election 2022: రాష్ట్రపతి ఎన్నికకు నగరా మోగడంతో దేశవ్యాప్తంగా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ సారి ఏ కూటమి అభ్యర్థి అధ్యక్ష పీఠంపై కూర్చోనున్నారో అనే ఉత్కంఠ పెరిగింది. ఈ రేసులో ఎవరెవరూ నిల్చోనున్నారనే అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. పలు జాతీయ నేతలు ఈ రేసులో ఉన్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే.. ప్రెసిడెంట్ రేసులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిలువనున్నారనే అనే ఊహాగానాలపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న ఊహాగానాలకు కొట్టిపారేశారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవి రేసులో తాను లేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం స్పష్టం చేశారు.
విలేకరుల అడిగిన ప్రశ్నలకు సీఎం నితీష్ కుమార్ సమాధానమిస్తూ.. “నేను దేశానికి తదుపరి రాష్ట్రపతి అయ్యే రేసులో లేను. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. అలాంటి నివేదికలు నిరాధారమైనవి, అవి ఊహాగానాలు మాత్రమే.’’ అని తెలిపారు. కాగా.. రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరగనున్నాయి.
జూన్ 9న రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే.. బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్‌కుమార్.. నితీష్ కుమార్ పై ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. రాష్ట్రపతి పదవికి సీఎం నితీష్ కూమార్ అన్ని విధాలుగా అర్హుడని ప్రకటించారు. ఈ ప్రకటనపై ముఖ్యమంత్రిని అడిగితే.. తాను దేశానికి తదుపరి రాష్ట్రపతి రేసులో లేనని పదే పదే చెబుతున్నానని క్లారిటీ ఇచ్చారు.
మహారాష్ట్ర నాయకుడు నవాబ్ మాలిక్ కూడా నితీష్ కుమార్ అధ్యక్ష రేసులో ఉన్నారని తెలిపారు. నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో బంధాన్ని తెంచుకుంటే.. రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని తన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అతనికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో బీహార్‌లో డబ్బు వినియోగం, ఇతర అవినీతి వ్యవహారాలు ఏవీ తెరపైకి రాలేదని నితీష్ కుమార్ చెప్పారు. ఇలాంటి కేసులు తెరపైకి వచ్చిన రాష్ట్రాలు బీహార్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలన్ని ఏకాభిప్రాయానికి రావాలని పశ్చిమ బెంగాల్ సిఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. మమతా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అరవింద్ కేజ్రీవాల్, పినరయి విజయన్, నవీన్ పట్నాయక్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, హేమంత్ సోరెన్, భగవంత్ మాన్, సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, డి రాజా, సీతారాం ఏచూరి లు హాజరుకానున్నారు. యాదవ్, శరద్ పవార్, జయంత్ చౌదరి, హెచ్‌డి కుమారస్వామి, హెచ్‌డి దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సుఖ్‌బీర్ సింగ్ బాదల్, పవన్ చామ్లింగ్, కెఎమ్ కాదర్ మొహిదీన్ రానున్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో, బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఎన్‌డిఎ మిత్రపక్షాలు, విపక్షాలతో చర్చలు జరిపి పార్టీ శ్రేణులకు అతీతంగా మద్దతు పొందే అభ్యర్థిని ఎన్నుకునే పనిని అప్పగించింది.
