మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రజల్లో ఇమేజ్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఇకపై సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ను ఆపొద్దని ఆయన పోలీస్ శాఖను ఆదేశించారు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) ప్రభుత్వాన్ని విజయవంతంగా కుప్పకూల్చడంతో పాటు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకున్న ఏక్ నాథ్ షిండే (eknath shinde) ఇక పాలనపై దృష్టి సారించారు. అలాగే తాను ప్రజల మనిషినని నిరూపించుకునేందుకు.. ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యహరిస్తున్నారు. దీనిలో భాగంగా సీఎం కాన్వాయ్ ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ ను ఆపొద్దని, తన కాన్వాయ్ కి ప్రత్యేకంగా ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని ఏక్‌నాథ్ షిండే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ శాఖకు దిశానిర్దేశం చేశారు. వీవీఐపీల కోసం ట్రాఫిక్ ను నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని సీఎం అన్నారు. సీఎం ప్రయాణించే రూట్ లో బందోబస్తుకు కేటాయించే సిబ్బందిని కూడా తగ్గించాలని షిండే ఆదేశించారు.
ఇకపోతే.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకనాథ్ షిండేను గవర్నర్ ఆహ్వానించడంతో పాటు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం సుప్రీంకోర్టును (supreme court) ఆశ్రయించింది. దీనిని స్వీకరించిన ధర్మాసనం విచారణను జూలై 11వ తేదీకి వాయిదా వేసింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం మెజారిటీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నందున తమదే నిజమైన శివసేన అని చెపుతోంది. కాగా తిరుగుబాటు నాయకులు సేనలో ఇక లేరని, వారు తనను వెన్నుపోటు పొడిచారని ఠాక్రే వాదిస్తున్నారు.
ఇప్పటి వరకు తిరుగుబాటు వర్గం బలం 40 ఉండగా.. ఉద్దవ్ కు కేవలం 15 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉంది. షిండే సీఎంపై తిరుగుబాటు చేసి, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసిన తరువాత గవర్నర్ బలపరీక్షకు ఆదేశించారు. కానీ బలపరీక్షకు ఠాక్రే నిరాకరించి సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గవర్నర్ షిండేను ఆహ్వానించారు. ఇదే నిర్ణయాన్ని ఉద్ధవ్ శిబిరం ఇప్పుడు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తమ అభ్యర్థికి ఓటు వేయాలని రెబల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసిందని, అయితే వారు విప్ ను ధిక్కరించి మరో వైపు ఓటు వేశారన్న కారణంతో స్పీకర్ ఎన్నికను సవాలు చేశారు. 39 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ శిబిరం ఇప్పటికే కోరింది.
ఇప్పుడు ఉద్ధవ్ థాకరే, ఏక్ నాథ్ షిండేలు ఇద్దరూ శివసేనను (shivsena) తమ ఆధీనంలోకి తీసుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మాజీ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన డిస్కలిఫికేషన్ నోటీసును కూడా సుప్రీంకోర్టు జూలై 11వ తేదీన విచారణకు తీసుకోనుంది. ఉద్ధవ్ కోర్టులో తన పోరాటాన్ని సమర్థిస్తుండగా షిండే క్షేత్రస్థాయిలో మద్దతు మరింత మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. తన శిబిరంలోకి మరింత మంది నాయకులను లాగుతూ ఠాక్రే వర్గాన్ని మరింత బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే శివసేనకు చెందిన 66 మంది మాజీ కార్పొరేటర్లు గురువారం థానేలోని షిండే శిబిరంలో చేరారు. నవీ ముంబైలోని ముప్పై రెండు మంది కార్పొరేటర్లు కూడా షిండేకు మద్దతు పలికారు.
