ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీ నుంచి, మా దిల్ నుంచి దూరం కాలేవన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి.
నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఘన విజయాలు సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. గురువారం వెల్లడైన ఫలితాలతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ. ఈశాన్య రాష్ట్రాలు ఢిల్లీ నుంచి, మా దిల్ నుంచి దూరం కాలేదన్నారు. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలంటే హింస కనిపించేదని, కానీ ఇప్పుడు మార్పు కనిపిస్తోందని మోడీ పేర్కొన్నారు. బీజేపీ విజయం సాధించడానికి ‘‘త్రివేణి’’ కారణమని ప్రధాని అన్నారు.
కాగా.. త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయా అసెంబ్లీలకు 60 చొప్పున స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ మార్క్ 31. త్రిపుర, నాగాల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. వామపక్షాలు దీర్ఘకాలం పాలించిన త్రిపురలో మరోసారి బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. బీజేపీ, ఐపీఎఫ్‌టీ కూటమి 33 సీట్లను గెలుచుకుంది. అయితే, గత 2018 ఎన్నికలతో పోల్చితే ఈ కూటమి సాధించిన సీట్ల సంఖ్య 11 తగ్గాయి. అప్పుడు బీజేపీ సొంతంగా 36 స్థానాలను గెలుచుకుంది. కాగా, ఇక్కడ సీపీఎం, కాంగ్రెస్ కూటమిని వెనక్కి నెట్టి కొత్తగా స్థాపించిన తిప్రా మోతా 13 సీట్లు గెలుచుకుని ఆశ్చర్యపరిచింది. నాగాల్యాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ), బీజేపీ కూటమి 37 స్థానాలను గెలుచుకుంది. గతంలో కంటే 7 స్థానాలు మెరుగుపరుచుకుంది. మెజార్టీ సీట్లు గెలుచుకున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది.
ALso REad: బీజేపీ 3/3: ఈశాన్యంలో విరిసిన కమలం.. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు!
మేఘాలయాలో హంగ్ ఏర్పడింది. అయితే, నేషనల్ పీపుల్స్ పార్టీ 26 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఈ పార్టీ బీజేపీతో మరోసారి జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 3 సీట్లు గెలుచుకున్న బీజేపీతో కలుస్తామని కొన్రాడ్ సంగ్మా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఈ రెండు పార్టీలు గతంలో కలిసి ఉన్న అవినీతి ఆరోపణలతో విడిపోయాయి. కొన్రాడ్ సంగ్మా సారథ్యంలోని ఎన్‌పీపీ, బీజేపీ విడిగా పోటీకి దిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కొన్రాడ్ సంగ్మా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశాడని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటులో కొన్రాడ్ సంగ్మాకు బీజేపీ మద్దతు ఇవ్వాలని జేపీ నడ్డా దిశానిర్దేశం చేసినట్టు మరో ట్వీట్‌లో వెల్లడించారు. మేఘాలయాలో కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకోగా.. ఇతరులు 25 సీట్లు గెలుచుకున్నారు.
