దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమికి అడుగులు పడుతున్నాయి. దీనిలో భాగంగా త్వరలో బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. దీనికి ముంబై వేదిక కానుందని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 

దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబై (mumbai) వేదికగా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల (non bjp chief ministers) సమావేశం నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు శివసేన ఎంపీ, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ (sanjay raut) ఆదివారం సంకేతాలిచ్చారు. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ (bjp) ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) ఇటీవల అన్ని బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలలో.. దేశంలో నెలకొన్న విషయాలపై చర్చించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (uddhav thackeray) , ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (sharad pawar) కలిసి చర్చించారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా త్వరలో ముంబయి వేదికగా బీజేపీయేతర సీఎంల సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంజయ్ రౌత్‌ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మతపరమైన అల్లర్లు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలు వున్నట్లు రౌత్‌ వెల్లడించారు. అలాగే, దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి, హనుమాన్‌ జయంతి సందర్భంగా జరిగిన కొన్ని ఘటనలు రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆయన ఆరోపించారు. 

త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లోనే ఒక వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు ఈ కుట్రలు జరుగుతున్నాయని సంజయ్ వ్యాఖ్యానించారు. కాగా, దేశంలో ఇటీవల చోటుచేసుకున్న విద్వేష ప్రసంగాలు, మతపరమైన హింసకు సంబంధించి కాంగ్రెస్‌ సహా 13 విపక్ష పార్టీల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిజెపియేతర సీఎంలు భేటీ కానుండడం దేశ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు.. కొంతకాలంగా మ‌హారాష్ట్రలో మ‌సీదుల లౌడ్ల స్పీక‌ర్ల విష‌యంలో గొడ‌వ జ‌రుగుతోంది. ఈ గొడ‌వకు మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన (maharashtra navnirman sena ) అధినేత రాజ్ ఠాక్రే (raj thackeray) ఆజ్యం పోశారు. మ‌సీదుల్లో లౌడ్ స్పీక‌ర్లను తొల‌గించాల‌ని, లేక‌పోతే ఆ మసీదుల ఎదుట హ‌నుమాన్ చాలీసా ప్లే చేస్తామని ఇటీవ‌ల ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ వాఖ్య‌లు మ‌హారాష్ట్రలో దుమారాన్ని రేపాయి. తాజాగా ఈ విష‌యంపై మ‌ళ్లీ తాజాగా రాజ్ ఠాక్రే వ్యాఖ్య‌లు చేశారు. మసీదుల నుండి లౌడ్‌స్పీకర్లను తొలగించాలనే డిమాండ్ తన ముస్లింల ప్రార్థనల వ్యతిరేకత నుండి ఉద్భవించలేదని ఆయ‌న స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎలాంటి అల్లర్లూ జరగడం తమ పార్టీకి ఇష్టం లేదని థాకరే అన్నారు. చట్టం కంటే మతం పెద్దది కాదని ముస్లింలు అర్థం చేసుకోవాలన్న ఆయన.. మే 3 తర్వాత ఏం చేయాలో చూస్తాను అని రాజ్ థాకరే అన్నారు.