న్యూఢిల్లీ:కొద్ది రోజుల క్రితం కన్పించకుండా పోయిన బిజినెస్ మ్యాన్ ఆదిత్య సోని డెడ్ బాడీని సోమవారం నాడు గ్యాంగ్ కాలువ సమీపంలో పోలీసులు గుర్తించారు. ఈ నెల 5వ తేదీన న్యూఢిల్లీలో కరోనా సోకిన తన బంధువులను పరామర్శించేందుకు ఆదిత్య వెళ్లాడు. అప్పటి నుండి ఆయన కన్పించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమవారం నాడు ఆదిత్య సోని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంకజ్, దేవ్ అనే ఇద్దరు స్నేహితులతో కలిసి తన కొడుకు చివరిసారిగా ఉన్నట్టుగా కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు.  వీరిద్దరూ కూడ ఆదిత్య స్నేహితులు. 

వీరిని ప్రశ్నించిన పోలీసులకు ఆదిత్య సోని హత్యకు గురైన విషయం తెలిసింది. మృతదేహాన్ని సోమవారం నాడు గ్యాంగ్ కాలువ సమీపంలో గుర్తించారు. ఆదిత్య తమను కలిసిన సమయంలో మాటల మధ్యలో ఓ జోక్ వేశాడు. ఈ విషయమై తమ ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకొందని నిందితులు తెలిపారు.

దీంతో తాము కర్రలతో ఆదిత్యపై దాడి చేసినట్టుగా చెప్పారు. ఆదిత్య నుండి సెల్ ఫోన్ , బంగారం తీసుకొని మృతదేహాన్ని గ్యాంగ్ కెనాల్ సమీపంలో పారేసినట్టుగా నిందితులు చెప్పారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.