కొలీజియం వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదు: మాజీ సీజేఐ యూయూ లలిత్
కొలీజియం వ్య వస్థను మార్చాల్సిన అవసరం లేదని మాజీ సీజేఐ యూయూ లలిత్ పేర్కొన్నారు. ప్రస్తుత కొలీజియం వ్యవస్థ బాగానే ఉన్నదని తెలిపారు. కొలీజియం చుట్టూ అనేక రకాల వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో మాజీ సీజేఐ తన అభిప్రాయాన్ని వెల్లడించడగం గమనార్హం.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ కొలీజియం వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థ సరిగ్గా ఉన్నదని, దాన్ని మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కొంత కాలంగా కొలీజియం వ్యవస్థ చుట్టూ అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొలీజియం వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ప్రభుత్వం బలంగా చెబుతున్నది. కాగా, కొలీజియం వ్యవస్థ సరిగ్గా ఉన్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీజేఐ యూయూ లలిత్ తన అభిప్రాయాలు వెల్లడించారు.
థింక్ ఎడ్యు కాంక్లేవ్ 12వ ఎడిషన్ ప్రారంభ సెషన్‌లో వై స్టడీ లా అనే అంశంపై ఆయన ఫిబ్రవరి 9వ తేదీన మాట్లాడారు. న్యాయ శాస్త్రాన్ని కేవలం యూనివర్సిటీలు, కాలేజీలకే పరిమితం చేయవద్దని అన్నారు. సాధారణ ప్రజలందరికీ న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసే వీలును అందుబాటులోకి తేవాలని వివరించారు. లా స్టూడెంట్లకు రూరల్ పాపులేషన్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా ఇంటర్న్‌షిప్స్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో ఇంటరాక్ట్ కావడం, వారి సమస్యలను, వారు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవడం వంటి ఇంటర్న్‌షిప్‌లను ప్రవేశం పెట్టడం మంచిదని వివరించారు.
మెడికల్ స్టూడెంట్లకు ఇలాంటి ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరిగా ఉన్నట్టే న్యాయ విద్యార్థులకూ అలాంటి ఇంటర్న్‌షిప్ ఉండాలని అన్నారు. రూరల్ పాపులేషన్‌తో, రూరల్ ఏరియాలో మెడికల్ స్టూడెంట్లకు ఇంటర్న్‌షిప్‌లు ఉన్నట్టే లా స్టూడెంట్లకు కూడా ఇంటర్న్‌షిప్‌లు ఉండాలని అభిప్రాయపడ్డారు.