ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం లడ్డూలను తయారు చేసేందుకు ఇకపై నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా చేయబోమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం లడ్డూలను తయారు చేసేందుకు ఇకపై నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా చేయబోమని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ తెలిపారు. భీమా నాయక్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము నాణ్యమైన ఉత్పత్తులను అందజేస్తామని చెబుతున్నందున ధర విషయంలో రాజీ పడలేదని చెప్పారు. అందుకే ఆలయ ట్రస్టు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వారు అడిగిన టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదని తెలిపారు. అయితే చాలా ఏళ్లుగా టీటీడీకి కేఎంఎఫ్ నెయ్యిని సరఫరా చేస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో నందిని నెయ్యినే వినియోగిస్తున్నారు. నాణ్యమైన కేఎంఎఫ్ నెయ్యి వల్ల లడ్డూలు బాగా రుచిగా ఉంటాయని టీటీడీ అనేక సందర్భాల్లో వ్యక్తం చేసింది.
ఇక, నందిని పాల విక్రయ ధరలను లీటరుకు మూడు రూపాయలు పెంచాలన్న కేఎంఎఫ్ ప్రతిపాదనకు జూలై 27న కర్ణాటక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కొత్త ధరలు ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే తిరుమలకు నెయ్యి సరఫరాపై కూడా భీమా నాయక్ స్పందించారు. ‘‘చాలా సంవత్సరాలుగా తిరుపతి లడ్డూకు కేఎంఎఫ్ నెయ్యి ఉపయోగించబడుతుంది. నందిని నెయ్యిలో మరే ఇతర నెయ్యి నిలబడదని నేను నమ్ముతున్నాను. మా కస్టమర్లు మాకు ఈ 100 శాతం సర్టిఫికేషన్ ఇచ్చారు’’ అని చెప్పారు.
‘‘దాదాపు ఒక సంవత్సరం క్రితం వారు (టీటీడీ) టెండర్ పిలిచారు. టెండర్‌లో పాల్గొనమని కోరారు. మేము పోటీ రేటుకు నెయ్యి ఇవ్వలేము. ఎందుకంటే ఇ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లో.. ఎవరు తక్కువ రేటు కోట్ చేస్తే అది వారికే దక్కుతుంది కానీ మా రేటు నిర్ణయించబడింది. మేము మా రేటుకు నెయ్యి సరఫరా చేస్తాము. కానీ వారు (టీటీడీ) ఆ మొత్తాన్ని ఇవ్వమని చెప్పారు. కాబట్టి మేము సరఫరా చేయడం లేదు’’ అని చెప్పారు.
కేఎంఎఫ్‌తో పోలిస్తే ప్రస్తుత సరఫరాదారు టీటీడీకి నెయ్యి చాలా తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని భీమా నాయక్ పేర్కొన్నారు. ‘‘మాతో పోలిస్తే ఇది తక్కువ నాణ్యతతో ఉండవచ్చు.. వారికి కూడా ల్యాబ్‌లు ఉన్నందున వారు కూడా పరీక్షలు చేసి ఉండవచ్చు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ నిర్ణయం తీసుకుంటాయి’’ అని భీమా నాయక్ తెలిపారు. ప్రస్తుతం కేఎంఎఫ్ నెయ్యికి అధిక డిమాండ్ ఉందని పేర్కొన్నారు. అయితే కేఎంఎఫ్ ఈ డిమాండ్‌లో 60 శాతం మాత్రమే పూర్తి చేయగలదని.. మిగిలిన 40 శాతం తీర్చలేకపోయిందని తెలిపారు.
అయితే ఈ అంశంపై టీటీడీ స్పందిన మరోలా ఉంది. నందిని నెయ్యిని టీటీడీ కొనుగోలు చేయటం లేదని బీమా నాయక్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మార్చిలో నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఆహ్వానించిన ఈ-టెండర్‌లో కేఎంఎఫ్ పాల్గొనలేదన్నారు. కేఎంఎఫ్ నుంచి 20 ఏళ్లుగా టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుందని చెప్పారు. అయితే టెండర్లలో ఎల్1గా వచ్చిన వారి నుంచి కొనుగోలు చేస్తామని చెప్పారు. గతంలో ఓసారి నందిని నెయ్యికి ఎల్ 2గా రాగా.. ఎల్ 1తో మాట్లాడి.. నిబంధనలకు తగ్గట్లు నెయ్యిని వారి నుంచి కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. టీటీడీకి కేఎంఎఫ్ నుంచి నెయ్యి సరఫరా నిలిపివేతకు సంబంధించి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. బీజేపీ నేత సీటీ రవి స్పందిస్తూ.. ‘‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సిగ్గులేకుండా నందిని సమస్యను రాజకీయం చేసి, అమూల్‌పై దుష్ప్రచారం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, పాల ధరను పెంచింది. తద్వారా మునపటి ధరకు టీటీడీ బోర్డుకు నందిని నెయ్యి సరఫరా చేయడం అసాధ్యం. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రసిద్ధ తిరుపతి లడ్డూలను సిద్ధం చేయడానికి నందిని ఇకపై నెయ్యి సరఫరా చేయదు. కాంగ్రెస్ తన ఎజెండాను కొనసాగించడానికి సువర్ణ కర్ణాటకను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది’’ అని ట్వీట్ చేశారు.
అయితే టీటీడీకి ఏడాదికి పైగా నందిని నెయ్యి సరఫరా నిలిచిపోయిందని.. ఇది ఇటీవలి జరిగింది కాదని భీమా నాయక్ తెలిపారు.
