గ్రేటర్ నోయిడాలోని ఓ హౌజింగ్ సొసైటీ రూపొందించిన షరతులు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. లుంగీలు, నైటీలు ఇంటిలోనే ధరించేవని, కాబట్టి, వాటిని వేసుకుని ఆరు బయట, కామన్ ఏరియాల్లో తిరుగరాదని తెలిపింది. 

నోయిడా: గ్రేటర్ నోయిడాలోని ఓ హౌజింగ్ సొసైటీ రూపొందించిన షరతులు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నాయి. కొందరు సమర్థిస్తుండగా.. చాలా మంది విమర్శించారు. అసహజ, ఎబ్బెట్టు విషయాలే ప్రాధాన్యతలుగా గల సమాజంలో ఉన్నాం మనం అంటూ ఒకరు వాపోయారు. ఇంతకీ ఆ షరతులు ఏమిటంటే.. ఇంటి బయట లుంగీలు, నైటీలు వేసుకుని తిరగరాదని హౌజింగ్ సొసైటీ ఆ అపార్ట్‌మెంట్ నివాసులకు సూచనలు చేసింది. ఇలా వ్యక్తిగత విషయాలపైనా పోలీసింగ్ చేయడం సరికాదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

జూన్ 10వ తేదీన రూపొందించిన ఈ షరతులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్రేటర్ నోయిడాలోని హిమసాగర్ అపార్ట్‌మెంట్ ఏవోఏ నివాసుల కోసం ఈ నిబంధనలు రూపొందించారు. దయచేసి ఇంటి నుంచి బయట అడుగు పెట్టినప్పుడు, కామన్ ఏరియాల్లో ఉదాహరణకు పార్కింగ్ ఏరియాలోకి వెళ్లినప్పుడు లుంగీలు లేదా నైటీలు వేసుకుని వెళ్ళరాదని ఆ హిమసాగర్ సొసైటీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్క్యూలర్ పేర్కొంది.

Also Read: అస్సామీ ముస్లింల ప్రత్యేక అస్తిత్వం, భిన్న సంస్కృతి.. హిందు, ముస్లిం తేడా లేదు..!

ఏ సమయంలోనైనా సొసైటీలో బయట తిరిగేటప్పుడు మీరంతా కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది. మీ నడవడిక, డ్రెస్ పై దృష్టి పెట్టాలని కోరింది. తద్వార ఎదుటి వారు మీ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తపరచరు అని వివరించింది. కాబట్టి, ఇంటిలో ధరించే లుంగీలు, నైటీలను వేసుకుని బయట తిరుగరాదని సూచించింది. 

Scroll to load tweet…

దీనిపై రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీకే కల్రా మాట్లాడుతూ.. మా సొసైటీ తీసుకున్న మంచి నిర్ణయం ఇది అని చెప్పారు. మహిళలు నైటీల్లో తిరిగితే పురుషులు ఇబ్బంది పడతారని, అదే పురుషులు లుంగీల్లో తిరిగితే మహిళలు ఇబ్బంది పడుతారని వివరించారు. కాబట్టి, ఇరువురూ పరస్పరం గౌరవించుకోవాలని, ఈ డ్రెస్ కోడ్ పాటించడం ఉత్తమం అని పేర్కొన్నారు.