Asianet News TeluguAsianet News Telugu

రోహింగ్యాల విషయంలో అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.. స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో రోహింగ్యా శరణార్థులకు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) ఫ్లాట్‌లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. 

No direction given to provide EWS flats to Rohingya illegal refugees in Delhi says MHA
Author
First Published Aug 17, 2022, 4:17 PM IST

న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో రోహింగ్యా శరణార్థులకు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) ఫ్లాట్‌లను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. చట్టప్రకారం అక్రమ విదేశీయులను బహిష్కరించే వరకు డిటెన్షన్ సెంటర్‌లో ఉంచుతామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుత స్థలాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించలేదని.. వెంటనే ఆ పనిచేయాలని ఆదేశించామని పేర్కొంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేసింది. 

‘‘రోహింగ్యా అక్రమ విదేశీయుల గురించి మీడియాలోని కొన్ని విభాగాలలో వార్తా నివేదికలకు సంబంధించి.. న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో రోహింగ్యా అక్రమ వలసదారులకు EWS ఫ్లాట్‌లను అందించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నాం. రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. MHA ఇప్పటికే విదేశాంగ శాఖ ద్వారా సంబంధిత దేశంతో వారి బహిష్కరణ విషయాన్ని తీసుకున్నందున్న.. రోహింగ్యా అక్రమ విదేశీయులు ప్రస్తుత ప్రదేశంలో కొనసాగేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎంహెచ్‌ఏ ఆదేశించింది. చట్టప్రకారం అక్రమ విదేశీయులను బహిష్కరించే వరకు డిటెన్షన్ సెంటర్‌లో ఉంచాలి. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుత ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించలేదు. వెంటనే ఆ పని చేయాలని ఆదేశించాం’’ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వరుస ట్వీట్స్‌లో పేర్కొంది. ఇక, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్ కుమార్‌ను విధివిధానాలను పటిష్టం చేయవలసిందిగా కేంద్రం కోరింది. 

 

అయితే ఢిల్లీలోని మయన్మార్‌కు చెందిన రోహింగ్యా శరణార్థులకు అపార్ట్‌మెంట్స్‌కు తరలిస్తామని పోలీసు రక్షణ కల్పిస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అంతకుముందు ట్వీట్ చేశారు. ‘‘దేశంలో ఆశ్రయం పొందిన వారిని భారతదేశం ఎల్లప్పుడూ స్వాగతిస్తుంది. ఒక మైలురాయి నిర్ణయంతో రోహింగ్యా శరణార్థులందరినీ ఢిల్లీలోని బక్కర్‌వాలా ప్రాంతంలోని EWS ఫ్లాట్‌లకు తరలిస్తారు. వారికి ప్రాథమిక సౌకర్యాలు, UNHCR IDలు అందించబడతాయి. 24 గంటలూ ఢిల్లీ పోలీసు రక్షణ ఉంటుంది’’ అని పేర్కొన్నారు. బక్కర్‌వాలా ప్రాంతంలో ఇడబ్ల్యుఎస్ ఫ్లాట్‌లను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ) నిర్మించిందని వెల్లడించారు. అయితే తాజాగా అలాంటి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.

ఇక, రోహింగ్యా శరణార్థులు గత దశాబ్ద కాలంగా మదన్‌పూర్ ఖాదర్, కాళింది కుంజ్‌లలో నివసిస్తున్నారు. వారి తాత్కాలిక నివాసాలు 2018, 2021లో రెండుసార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అప్పటి నుంచి వారు ఢిల్లీ ప్రభుత్వం అందించిన గుడారాలలో నివసిస్తున్నారు. ఇక, ప్రస్తుతం శరణార్థులు ఉన్న ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు MHA తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios