గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు మరణించిన ఘటన తర్వాత భారత ప్రభుత్వం డ్రాగన్‌తో సై అంటోంది. ఇప్పటికే 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది.

Also Read:చైనాపై ఇండియా సర్జికల్ స్ట్రైక్స్.. 59 చైనీస్ యాప్స్‌పై నిషేధం

తాజాగా హైవే ప్రాజెక్టులో చైనా సంస్థలపై నిషేధం విధించనున్నట్లు ప్రకటించింది. హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు.

అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వివిధ రంగాల్లో చైనా పెట్టుబడిదారులను ప్రభుత్వం ప్రోత్సహించదని చెప్పారు. త్వరలోనే హైవే ప్రాజెక్టుల్లో పాల్గోనే చైనా సంస్థలపై నిషేధం విధించేలా ఓ విధానాన్ని తీసుకురాబోతున్నట్లు గడ్కరీ తెలిపారు.

Also Read:భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి: మన్‌కీ బాత్‌లో మోడీ

ఆ విధానంలో హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేలా భారత కంపెనీల అర్హత ప్రమాణాలు పెంపొందించేలా నిబంధనల సడలింపు కూడా చేపడతామని కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.