నితీష్ కుమార్ నాయకత్వం పట్ల ఎవరికీ అనుమానాలు లేవని, ఆయన పొలిటికల్ గ్రాఫ్ కూడా పెరుగుతోందని జేడీ(యూ) సీనియర్ నాయకుడు కేసీ త్యాగి అన్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉంది కాబట్టి 2030లో కూడా ఆయన సీఎం అభ్యర్థిగా ఉంటారని చెప్పారు.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ సమయంలోనే నిర్ణయిస్తామని జేడీ (యూ) జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ వ్యాఖ్యానించిన ఒక రోజు తరువాత ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ త్యాగి ఇదే అంశంపై స్పందించారు. 2030 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమికి సీఎం అభ్యర్థిగా ఉండగల సమర్థత నితీష్ కు ఉందని తెలిపారు. నితీష్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన పొలిటికల్ గ్రాఫ్ కూడా పెరుగుతోందని త్యాగి అన్నారు. జేడీయూ అంటే నితీశ్ అని, ఆయన నాయకత్వానికి ఎలాంటి సవాలు లేనందున ఆయన తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు.
ఢిల్లీ మేయర్ పీఠం ఆప్ సొంతం.. నూతన మేయర్‌గా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్..
ముఖ్యమంత్రి అభ్యర్థిపై లాలన్ సింగ్ చేసిన ప్రకటనపై త్యాగి స్పందిస్తూ.. మహాకూటమిలో చేరడంలో జేడీయూ అధ్యక్షుడు పాత్ర పోషించారని ఆయన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకోవద్దని సూచించారు. ఉపేంద్ర కుష్వాహా పార్టీకి రాజీనామా చేసిన తరువాత జరిగిన ఎన్నికలలో జేడీ (యూ) పనితీరు ప్రభావంపై త్యాగి మాట్లాడుతూ.. 2010 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ (యూ) సొంతంగా 118 స్థానాలను గెలుచుకోవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఏ నాయకుడి చేరిక లేదా నిష్క్రమణ వల్ల పార్టీ మద్దతు పునాది తగ్గిపోతుందని తాను అనుకోవడం లేదని అన్నారు. నితీశ్ ఇమేజ్, సామర్థ్యంపై ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు.
కాగా.. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను నితీష్ కుమార్ తన రాజకీయ నాయకుడిగా పేర్కొంటూ జేడీ(యూ)ను ఆర్జేడీ చేతిలో పెట్టారని ఆరోపిస్తూ ఉపేంద్ర కుష్వాహా పార్టీకి రెండు రోజుల కిందట రాజీనామా చేశారు. నితీశ్ తిరిగి మహాకూటమిలోకి వచ్చి బీహార్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి తేజస్వీపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. భవిష్యత్తులో బీహార్‌ను ఆర్జేడీ నాయకుడు చూసుకుంటాడని ఆయన మీడియాతో తెలిపారు. 2025 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమికి తేజస్వి నాయకత్వం వహిస్తారని తెలిపారు.
కుష్వాహా పార్టీకి రాజీనామా చేసే ముందు జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్ సింగ్ ను పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీ మహాకూటమిలో చేరి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు ఏదైనా ఒప్పందం కుదిరిందా అని స్పష్టం చేయాలని అన్నారు. ఇదిలా ఉండగా.. నితీష్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నందున తేజస్విని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ఊహాగానాలు ఇప్పటికే విస్తృతంగా వినిపిస్తున్నాయి.
