Asianet News TeluguAsianet News Telugu

నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్‌లకు షాక్.. బీజేపీ కీలక కమిటీ‌లో నుంచి ఔట్..

బీజేపీ పార్లమెంటరీ బోర్డు కొత్త జాబితాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. అయితే బీజేపీ అగ్రనేతలుగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించడం హాట్ టాపిక్‌గా మారింది.

Nitin Gadkari and Shivraj Chouhan dropped from Top BJP Body
Author
First Published Aug 17, 2022, 5:51 PM IST

2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు చేసింది. పార్లమెంటరీ బోర్డు కొత్త జాబితాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. అయితే బీజేపీ అగ్రనేతలుగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లకు పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పిస్తారని భావించినప్పటికీ.. అది జరగలేదు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్‌కు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో చోటు కల్పించారు. 

అయితే అనుహ్యంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో పలువురికి కొత్తగా పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించారు. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పార్లమెంటరీ బోర్డులో తిరిగి చోటు దక్కింది. 

అయితే నితీన్ గడ్కరీకి పార్లమెంటరీ బోర్డులో చోటు దక్కకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లోని సీనియర్ మంత్రులలో గడ్కరీ ఒక్కరు. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా కూడా ఆయన గతంలో పనిచేశారు. అలాంటి ముఖ్యనేతకు మరోసారి పార్లమెంటరీ బోర్డులో చోటు దక్కకపోవడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో నితిన్ గడ్కరీకి ఉన్న బలమైన అనుబంధం కారణంగా.. ఆయన  సొంత ప్రభుత్వంపై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటారని.. ఇది కూడా ఆయనను తప్పించేందుకు ఒక్క కారణం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇక, పార్లమెంటరీ బోర్డులో.. జేపీ నడ్డా, నరేంద్ర మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద్ సోనోవాల్, కె లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ్ జటియా, బీఎల్ సంతోష్‌లు ఉన్నారు. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిటీలో.. ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీఎస్ యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, కె లక్ష్మణ్, సుధా యాదవ్, బీఎల్ సంతోష్, సత్యనారాయన్ జాటియా, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మాథుర్‌లు సభ్యులుగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios