వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కేసు విషయంలో  పోలీసులు హైకోర్టుకు వింత వాదన వినిపించారు. ఆయనపపై అత్యాచార ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయనకు నోటీసులు ఎందుకు పంపలేదు అనే విషయంపై హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. దీనిపై పోలీసులు చెప్పిన మాటలు అందరినీ విస్మయానికి గురిచేశాయి.

నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న కారణంగా ఆయనకు నోటీసులు జారీ చేయలేకపోయామని న్యాయస్థానానికి విన్నవించారు. అత్యాచారం, మోసం, ఆధారాలు మాయం చేయడం, పోలీసులను తప్పుదోవ పట్టించడం సహా పలు కేసుల్లో నిత్యానంద నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 

Also Read సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద: పేరు ఇదే..!!..

ఈ మేరకు 2010లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రెండుసార్లు అరెస్టైన నిత్యానంద.. రామనగరలోని అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణ ఎదుర్కొని .. బెయిలుపై బయటకు వచ్చాడు.

కాగా.. ఆయన 2018లో దేశం విడిచిపారిపోయాడు. అంతేగాక ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో కైలాస పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు కూడా ప్రకటించాడు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్ పోల్ ఇటీవల బ్లకార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది.

ఈ నేపథ్యంలో 2010 నాటి కేసులో నిత్యానంద బెయిలును రద్దు చేయాల్సిందిగా పిటిషన్‌ దాఖలైన నేపథ్యంలో.. అతడిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా కర్ణాటక హైకోర్టు జనవరి 31న పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

దీంతో వాళ్లు నిత్యానందకు చెందిన ఆశ్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన లేరని.. దీంతో ఆయన అనుచరురాలు కుమారి అర్చానందకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. నిత్యానంద ఆధ్యాత్మిక టూర్‌లో ఉన్న కారణంగా ఆయనను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయామని వెల్లడించారు.