Lok Sabha Elections: కర్ణాటక నుంచి ఆ ముగ్గురు కేంద్రమంత్రులు పోటీ
కర్ణాటక నుంచి ముగ్గురు కేంద్రమంత్రులు లోక్ సభ బరిలోకి దిగబోతున్నారు. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లు ఉన్నారు.
Nirmala Sitharaman: పలువురు రాజ్యసభ ఎంపీలు కేంద్రమంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లు ఉన్నారు. వీరితోపాటు మరో కేంద్రమంత్రిని కూడా కర్ణాటక నుంచి లోక్ సభ బరిలో నిలబెట్టాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు కర్ణాటక బీజేపీ నాయకత్వానికి హైకమాండ్ సూచించినట్టూ సమాచారం.
బెంగళూరులోని యెలహంకలో జనవరి 10వ, 11వ తేదీల్లో నిర్వహించిన రెండు రోజుల లోక్ సభ సన్నాహక సమావేశంలో ఈ మేరకు చర్చించారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి రాష్ట్ర ఇంచార్జీ అరుణ్ సింగ్ ఈ మేరకు నిర్దేశించినట్టు తెలిసింది. ఇద్దరు లేదా ముగ్గురు కేంద్రమంత్రులు కర్ణాటక నుంచి పోటీ చేస్తారని, వారిని స్వాగతించాలని సూచనలు చేశారు. కేంద్రమంత్రులు నిర్మల సీతారామన్, ఎస్ జైశంకర్‌లను కర్ణాటక నుంచి లోక్ సభ టికెట్లు ఇవ్వాలని బీజేపీ చర్చిస్తున్నట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.
బీజేపీ ప్రాబల్యం బలంగా ఉన్న స్థానాల్లో కేంద్రమంత్రులను బరిలోకి దింపాలని ఆలోచనలు చేస్తున్నది. ఇందులో భాగంగా బెంగళూరు సౌత్, బెంగళూరు సెంట్రల్, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ లోక్ సభ స్థానాల్లో వేటినైనా ఈ కేంద్రమంత్రులకు టికెట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.
కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మల సీతారామన్‌ను దక్షిణ కన్నడ లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నది. ప్రస్తుతం ఈ సీటుకు కర్ణాటక బీజేపీ మాజీ అధ్యక్షుడు నలిన్ కుమార్ కతీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన మూడు సార్లు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న జైశంకర్ గత సంవత్సరం పలుమార్లు బెంగళూరుకు వెళ్లారు. ఆయనను బెంగళూరు సౌత్, బెంగళూరు సెంట్రల్ లేదా ఉత్తర కన్నడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. వీరిద్దరితోపాటు మరో కేంద్రమంత్రిని కూడా ఇక్కడి నుంచి బరిలోకి దించాలని హైకమాండ్ యోచిస్తున్నదని, ఆయనను కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్వాగతించాలని సూచించింది.