Asianet News TeluguAsianet News Telugu

Sunil Kanugolu: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దెబ్బ.. వ్యూహకర్త సునీల్ కనుగోలు దూరం.. కాంగ్రెస్ ఆలోచన ఇదేనా?

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరో వ్యూహకర్త దూరం అయ్యారు. 2022లో ప్రశాంత్ కిశోర్ దూరం అవ్వగా.. తాజాగా సునీల్ కనుగోలు కూడా కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేయడం లేదని తెలిసింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్ అనే చెప్పాలి.
 

election strategist sunil kanugolu not part of 2024 planning of congress party kms
Author
First Published Jan 12, 2024, 2:12 PM IST

Congress Party: ఇటీవలి కాలంలో వ్యూహకర్త సునీల్ కనుగోలు పేరు ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ విజయాల చర్చలో ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది. హోరాహోరీగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ ఉన్నారు. ఆశే లేని కాంగ్రెస్‌ను తెలంగాణలోనూ అధికార పీఠానికి చేరువ చేసిన కృషిలోనూ ఈయనది కీలక పాత్ర. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్, సోషల్ మీడియా క్యాంపెయిన్ వంటి బాధ్యతలను చూస్తారనే వార్తలు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు కొంత సంబురపడ్డాయి. కానీ, తాజా వార్త మాత్రం కొంత దిగులు కలిగించేదిగా ఉన్నది.

2024 లోక్ సభ ఎన్నికల్లో సునీల్ కనుగోలు కాంగ్రెస్ క్యాంపెయిన్‌లో భాగంగా ఉండటం లేదు. ఆయన ఇప్పుడు హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ కోసం పని చేస్తారని కొన్ని విశ్వసనీయవర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. జనరల్ సెక్రెటరీ పదవి కలిగిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ఈ విషయాన్ని చెప్పారు. ఇది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఒక కుదుపు అని ఆయన అంగీకరించినట్టూ ఆ మీడియా పేర్కొంది. అయితే, త్వరలో జరగనున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పని చేసి కాంగ్రెస్‌కు అధికారాన్ని అందించే విధంగా కృషి చేస్తే అది దీర్ఘకాలికంగా పార్టీకి కలిసి వస్తుందని నమ్ముతున్నట్టు ఆ నేత చెప్పినట్టు రిపోర్ట్ చేసింది. 

Also Read: జీవితంపై ఆశలన్నీ ఆవిరయ్యాయి.. ఈ జైలులోనే చస్తే బాగుండు: కోర్టులో జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ నరేష్ గోయల్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేయకుండా తప్పుకున్న రెండో అతిపెద్ద స్ట్రాటజిస్ట్ కనుగోలు. 2022లో ప్రశాంత్ కిశోర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని పీకే స్పష్టం చేశారు. పీకే షరతులను అంగీకరించని కాంగ్రెస్ ఆయన సేవలను స్వీకరించలేదు. తాజాగా, సునీల్ కనుగోలు కూడా కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో వ్యూహకర్తగా పని చేయడం లేదు.

కనుగోలు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పని చేస్తారు. అక్కడ క్యాబినెట్ ర్యాంక్ హోదాలో సీఎం సిద్ధరామయ్యకు ప్రైమరీ అడ్వైజర్‌గా ఉన్నారు.

కాంగ్రెస్ గెలుపులో సునీల్ కనుగోలు గణనీయమైన పాత్ర ఉన్నది. ఆయన పని చేయని మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా తుడుచుకుపోయిన సంగతి తెలిసిందే. కమల్ నాథ్, అశోక్ గెహ్లాట్‌లతో మాట్లాడినా.. వారు అంగీకరించకపోవడంతో కనుగోలు దూరంగా ఉన్నారు. అదే కర్ణాటక, తెలంగాణలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనే వార్తలు ఉన్నాయి.

Also Read: Bangles: ఒక్క కొడుకు ఉన్నవారికి ఇద్దరు కొడుకులున్నవారు గాజులు వేయాలా? పండితులు ఏమంటున్నారు?

ఇక లోక్ సభ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు కాంప్లికేటెడ్‌గా మారాయి. ఇండియా కూటమిలో మిత్ర పార్టీలతో అలకలు, డిమాండ్లు, సీట్ల పంపకాల్లో పేచీలు, వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. మ్యాన్ ఆఫ్ ఐడియాస్‌గా పేరున్న సునీల్ కనుగోలు సహకారం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో ఎంతో కలిసి వస్తుంది. ఎందుకంటే.. సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ మిత్రపార్టీలతోపాటు బీజేపీతోనూ పని చేసిన అనుభవం ఉన్నది. 2014 బీజేపీ క్యాంపెయిన్‌లో భాగమయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి పని చేసి మొత్తం 39 ఎంపీ స్థానాల్లో 38 స్థానాలను డీఎంకే గెలుచుకోవడంలో కీలకంగా పని చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో సునీల్ కనుగోలు సేవలు లేకున్నా.. రాష్ట్రాల్లో బీజేపీని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలనే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆ పార్టీ ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. కర్ణాటక, తెలంగాణతోపాటు హర్యానాలోనూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది. ఈ ఏడాది రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలో కాంగ్రెస్ ఓడిపోయింది. 2022లో పంజాబ్‌ను ఆప్ పార్టీకి అప్పగించింది. ఇప్పుడు  కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే బీజేపీ 12 రాష్ట్రాల్లో ఉన్నది. ఈ రాష్ట్రాల సంఖ్యను పెంచుకుని స్ట్రాంగ్ బేస్‌ను నిర్మించుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.

Also Read : KCR : మళ్లీ ఎన్నికల రంగంలోకి కేసీఆర్.. ఆరు నెలల గడువు ఉత్తమాటేనా?

హర్యానాలో బీజేపీ పెద్దగా బలంగా ఏమీ లేదు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పటికీ శివసేన పార్టీలో చీలికతో కాంగ్రెస్ కూడా అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఈ రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఓడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచి బలపడాలని యోచిస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios