ఉరిశిక్షకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో మరోసారి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇదే సమయంలో తాము మరణించేందుకు అనుమతి ఇవ్వాలని నిర్భయ దోషుల కుటుంబసభ్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు.

తన బిడ్డకు న్యాయం చేయాలని తానూ రాష్ట్రపతిని కోరుతున్నానని.. కేవలం నిర్భయ పేరు వల్లే, తాను తన కుటుంబం ఈ దేశానికి తెలుసునన్నారు. తాను ఏడేళ్లుగా ప్రతిరోజూ చస్తున్నానని.. జనాలు ఏమంటున్నారో తెలుసునని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:నిర్భయ కేసులో మరో ట్విస్ట్: చచ్చిపోతామని దోషుల తల్లిదండ్రుల బెదిరింపు

చాలా మంది తాను డ్రామా ఆడుతున్నానని అంటున్నారని.. అన్యాయం జరిగిన కుటుంబం న్యాయం చేయాలని డిమాండ్ చేయడం డ్రామా అవుతుందా అని ఆశా దేవి ప్రశ్నించారు. తమ గుండెకోతను మీరు నాటకమే అనుకుంటే.. ఔను తాను నాటకాలే ఆడుతున్నానంటూ ఘాటుగా బదులిచ్చారు.

తమ ఆడబిడ్డలకు న్యాయం జరగాలంటే డ్రామానే ఆడాలేమోనని ఆశాదేవి ప్రశ్నించారు. ఈ సారి దోషులు తప్పించుకోలేరని, ఈ నెల 20న వారికి శిక్ష తప్పదని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఉరి కంభం ఎక్కించే తేదీలు మారతాయన్నారు. చట్టంలోని లోసుగులను అడ్డు పెట్టుకుని దోషులు శిక్ష ను వాయిదా వేస్తూ వస్తున్నారని ఆమె గుర్తుచేశారు. కానీ దోషులెవరికీ క్షమాభిక్ష పెట్టుకునే అవకాశమే లేదని, సుప్రీంకోర్టుపై తనకు నాకు విశ్వాసం ఉందని ఆశా దేవి తెలిపారు.

Also Read:నిర్భయ కేసులో కొత్త ట్విస్ట్: ఉరిశిక్షపై అంతర్జాతీయ కోర్టుకెక్కిన దోషులు

న్యాయస్థానం నిర్ణయం తమ కుటుంబానికీ, దేశానికి అనుకూలంగా ఉంటుందని నమ్ముతున్నానన్నారు. ఇది నిర్భయకు మాత్రమే కాదని, దేశంలోని ప్రతి ఆడపిల్ల భద్రతకు జరిగే న్యాయంగా అభివర్ణించారు.

మరోవైపు నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని కోరుతూ వారి తరపు న్యాయవాది ఏపీ సింగ్ అంతర్జాతీయ కోర్టుకు లేఖ రాశారు. ఇదిలా వుండగా తిరిగి క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతూ దోషి ముఖేశ్ సింగ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.