న్యూఢిల్లీ: నిర్భయ కేసులో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని కోరుతూ వారి తరఫు న్యాయవాది అంతర్జాతీయ కోర్టుకు లేఖ రాశారు. మార్చి 4వ తేదీన అమలు చేయనున్న ఉరిశిక్షపై స్టే ఇవ్వాలనిఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసిజె) ను ఆయన కోరారు. 

కింది కోర్టుల్లోని అన్ని రికార్డులను ఐసిజే ముందు ఉంచాలని, కేసును ఐసిజే ముందు ఉంచడానికి అది అవసరమని ఆయన అన్నారు. ఇదిలావుంటే, తిరిగి క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతూ ముకేష్ సింగ్ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది.

Also Read: నో చాన్స్: నిర్భయ కేసు దోషి తాజా పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం

నిర్బయ కేసు దోషులు నలుగురికి మార్చి 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగో దేషి పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించడంతో నలుగురు దోషులకు ఉన్న అవకాశాలన్నీ అయిపోయాయి. 

మరణశిక్ష అమలును వాయిదా పడే విధంగా దోషులు అక్షయ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేష్ సింగ్ పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారు. చివరకు అన్ని అవకాశాలు ముగిసిపోయాయి. ఈ స్థితిలో తాము కారుణ్య మరణం పొందడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖ రాశారు 

Also read: నిర్భయ కేసులో మరో ట్విస్ట్: చచ్చిపోతామని దోషుల తల్లిదండ్రుల బెదిరింపు

2012 డిసెంబర్ 16వ తేదీన కదులుతున్న బస్సులో 26 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టారు. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. 

ఆరుగురిలో ఒకతను మైనర్ కావడంతో అతను మూడేళ్ల శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.