నిర్భయ హత్యాచార నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తులు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. తాజాగా దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

తన క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ విషయంలో విధానపరమైన లోపాలు చోటు చేసుకున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు దోషుల తరపున న్యాయవాది ఏపీ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Also Read:నిర్భయ కేసులో మరో ట్విస్ట్: పోలీసులపై కోర్టుకెక్కిన దోషి పవన్ గుప్తా

తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలంటూ ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్ రాష్ట్రపతికి పంపిన సిఫార్సుల్లో ఆయన సంతకం లేదని వినయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అలాగే క్షమాభిక్ష పిటిషన్‌ దేశాధ్యక్షుడి వద్దకు చేరినప్పుడు ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, దాని ప్రకారం సత్యేంద్ర జైన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని తెలిపాడు.

క్షమాభిక్ష తిరస్కరణ విషయంలో రాజ్యాంగపరంగా అవకతవకలు జరిగాయని, అందరికీ న్యాయం జరగాలన్న రాజ్యాంగ సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని తన పిటిషన్‌పై విచారణ జరపాల్సిందిగా వినయ్ కోరాడు.

కాగా తనకు ఉరిశిక్ష నుంచి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా వినయ్ శర్మ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పిటిషన్ పెట్టుకోగా.. దానిని రామ్‌నాథ్ ఫిబ్రవరి 1న తిరస్కరించారు. అనేక వాయిదాల తర్వాత ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఈ నెల 20న ఉదయం 5.30 గంటలకు ఉరితీయాలంటూ కొత్త డెత్ వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:నిర్భయ దోషుల మరో ఎత్తుగడ: ఢిల్లీ లెఫ్టినెంట్‌‌ను ఆశ్రయించిన వినయ్ శర్మ

మరో దోషి పవన్ గుప్తా సైతం మండోలి జైలుకు చెందిన ఇద్దరు అధికారులు తనను పోలీస్ కస్డడీలో కొట్టారని, దాని వల్ల తలకు తీవ్రమైన గాయమైందంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతకుముందు వినయ్ శర్మ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు క్షమాభిక్ష పెట్టుకున్న సంగతి తెలిసిందే. జైలులో తాను శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిపాడు.