న్యూఢిల్లీ: నేరం జరిగిన సమయంలో తాను మైనర్ అనే విషయాన్న్ి హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నేరం జరిగిన సమయంలో తాను మైనర్ అనే పవన్ గుప్తా క్లెయిమ్ ను హైకోర్టు నిరుడు తోసిపుచ్చింది. 

నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులోని నలుగురు దోషులకు ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయం వెలువడిన నేపథ్యంలో పవన్ గుప్తా ఆ మెలిక పెట్టాడు. నేరం జరిగిన సమయంలో తాను మైనర్ ను అని, అమాయకమైన బాలుడిని అని పవన్ గుప్తా చెబుకుంటూ జువెనైల్ చట్టాల ప్రకారం తనకు శిక్ష విధించాలని పవన్ గుప్తా వాదించాడు. దానివల్ల అతనికి తక్కువ శిక్ష పడుతుంది. 

Also Read: నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి

తన వయస్సును నిర్దారించడానికి ఆ సమయంలో తగిన వైద్య పరీక్షలు జరగలేదని చెప్పాడు. అతని వాదనను నిరుడు డిసెంబర్ లో హైకోర్టు తోసిపుచ్చింది. నిజానికి, వినయ్ శర్మ, ముకేష్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలకు ఈ నెల 22వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని తొలుత నిర్ణయించారు. ట్రయల్ కోర్టు డెత్ వారెంట్ సంతకం కూడా చేసింది. 

దాంతో దోషులు సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారంనాడు తోసిపుచ్చింది. ఆ తర్వాత ముకేష్ సింగ్ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. దాంతో ఉరిశిక్ష అమలుకు మరో తేదీని నిర్ణయించాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. 

Also Read: నిర్భయ దోషి ముఖేష్‌సింగ్‌కు షాక్: క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ

ముకేష్ సింగ్ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించారు. అయితే, తాజాగా పవన్ గుప్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ద్వారా మరో మెలిక పెట్టాడు. దోషులు విడివిడిగా మెర్సీ పిటిషన్లు దాఖలు చేసే వ్యూహాన్ని అనుసరిస్తూ ఉరిశిక్ష అమలులో జాప్యం జరిగేలా చూసుకుంటున్నారు.