న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులను నలుగురిని ఉరి తీసే రోజు సమీపిస్తున్న కొద్దీ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దోషులు ఎత్తుగడల నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన ఉరిశిక్షను అమలు చేయడం సాధ్యమవుతుందా, లేదా అనే సందేహాలు అలుముకుంటున్నాయి. 

దోషుల్లో ఒక్కడైన వినయ్ శర్మ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. తనకు విధించి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ ఆ మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ముకేష్ సింగ్ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇప్పటికే తిరస్కరించారు. 

Also Read: నిర్భయ దోషి ముఖేష్ సింగ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

మెర్సీ పిటిషన్ తోసిపుచ్చిన తర్వాత కూడా ముకేష్ సింగ్.. ఆర్టికల్ 32 కింద క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.

వినయ్ శర్మ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నట్లు అతని తరఫు న్యాయవాది బుధవారం తెలిపారు. ముకేష్ సింగ్, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలతో పాటు అతనికి శనివారంనాడు మరణశిక్షను అమలు చేయాల్సి ఉంది. 

Also Read: నాపై జైలులో లైంగిక దాడి: నిర్భయ దోషి ముఖేష్ సంచలనం

2012 డిసెంబర్ 16వ తేదీన 23 ఏళ్ల వైద్య విద్యార్థినిని రేప్ చేసి, చిత్రహింసలు పెట్టారు. దాంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకతను జైలులో ఆత్మహత్య చేసుకోగా, మరొకతను జువైనల్ గా శిక్షను అనుభవించి విడుదలయ్యాడు. 

మిగతా నలుగురికి ఫిబ్రవరి 1వ తేదీన మరణశిక్షను అమలు చేయాలని కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. ఉరిశిక్ష అమలులో జాప్యం చేయడానికి దోషులు వివిధ పద్ధతులను అనుసరిస్తున్నారు. న్యాయప్రక్రియలోని వివిధ వెసులుబాట్లను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.