కేరళలో నిఫా వైరస్ కలకలం.. కంటైన్మెంట్ జోన్లుగా మారిన 7 గ్రామాలు.. స్కూళ్లను మూసేసిన అధికారులు
కేరళలో నిఫా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చి, ఇద్దరు మరణించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ ప్రభావిత 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించింది. ఆయా గ్రామాల్లో స్కూళ్లను కూడా మూసివేసింది.

కేరళలో మళ్లీ నిఫా వైరస్ వెలుగులోకి రావడం మళ్లీ కలకం రేకెత్తించింది. ఈ వైరస్ కారణంగా ఇద్దరు మరణించారు. వ్యాధి సంక్రమించకుండా వీరికి సంబంధం ఉన్న, సమీపంలో ఉన్న కోజికోడ్ లోని ఏడు గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు ముమ్మరం చేసినట్టు కేరళ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడితో సహా నలుగురిలో నాలుగు నిఫా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలలు, కార్యాలయాలను అధికారులు మూసివేసినట్టు ‘ఇండియా టుడే’ పేర్కొంది. సోకిన గబ్బిలాలు, పందులు లేదా ఇతర వ్యక్తుల శారీరక ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు వ్యాపించే నిఫా వైరస్ కోసం ఇప్పటివరకు 130 మందికి పైగా పరీక్షించినట్లు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఎ.గీత.. ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నట్టు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. అందులో అటాన్చేరి, మరుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయకోడి, విల్యాలపల్లి, కవిలంపర ఉన్నాయి. ఈ ఏడు గ్రామ పంచాయతీల్లోని 43 వార్డుల్లో తదుపరి నోటీసు వచ్చే వరకు ఎవరినీ లోపలికి అనుమతించబోమని పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాలను చుట్టుముట్టాలని ఆమె పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
నిఫా హెచ్చరికల నేపథ్యంలో పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) బృందాలు కేరళకు చేరుకుని కోజికోడ్ మెడికల్ కాలేజీలో మొబైల్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి నిఫా పరీక్షలు, గబ్బిలాల సర్వే నిర్వహించాల్సి ఉంది. కాగా. కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వెంటనే సీఎం పినరయి విజయన్ స్పందించారు. ప్రజలు భయాందోళన చెందవద్దని సూచించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య శాఖ, పోలీసుల సూచనలను కచ్చితంగా పాటించాలని, ఆంక్షలకు పూర్తిగా సహకరించాలని సూచించారు.
కాగా.. కేరళలో కనిపించిన నిపా వైరస్ స్ట్రెయిన్ బంగ్లాదేశ్ వేరియంట్ అని, ఇది మానవుల నుండి మానవులకు వ్యాపిస్తుందని, ఇది తక్కువ తీవ్రత ఉన్న అంటువ్యాధి అయినప్పటికీ అధిక మరణాల రేటును కలిగి ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. ఎన్ఐవీ పుణె బృందాలతో పాటు, చెన్నై నుంచి ఎపిడెమియాలజిస్టుల బృందం ఈ రోజు కేరళకు చేరుకుని సర్వే చేస్తుందని జార్జ్ తెలిపారు. నిఫా రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన మోనోక్లోనల్ యాంటీబాడీలను తొలగించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) బృందం కూడా అంగీకరించిందని మంత్రి సభకు తెలియజేశారు.