రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించింది. ఈ కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్ షరీఫ్‌ను అరెస్టు చేసింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) బుధవారం ముందడుగు వేసింది. ఈ కేసులో కీలక నిందితుడిని బుధవారం అరెస్టు చేసింది. కర్ణాకట, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన తర్వాత ఎన్ఐఏ కీలక నిందితుడు ముజమ్మిల్ షరీఫ్‌ను పట్టుకుంది.
కర్ణాటకలో 12 చోట్ల, తమిళనాడులో ఐదు చోట్ల, ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట ఈ రైడ్లు చేపట్టింది. ఎట్టకేలకు ఈ కేసులో కీలక నిందితుడైన షరీఫ్ అరెస్టుతో ఆ సోదాలు ముగిశాయి. పలు చోట్ల చేపట్టిన తనిఖీల్లో అధికారులు నిందితుల డబ్బు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. రామేశ్వరం బ్లాస్ట్ కేసులోని మాస్టర్ మైండ్లను, ఈ పేలుడు వెనుక జరిగిన భారీ కుట్రను కనుగొనడానికి ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తున్నది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా షజీబ్ హుస్సేన్‌ను గతంలో దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరో నిందితుడు అబ్దుల్ మతీన్ తాహాతో కలిసి ఈ పేలుడు జరిపారని అనుమానించారు.
ఎన్ఐఏ ప్రకారం, షరీఫ్ ఆ దుండగులకు పేలుడు కోసం లాజిస్టికల్ మద్దతు ఇచ్చాడు.