తమిళనాడు కేంద్రంగా ఉగ్రవాదులు పన్నిన భారీ ఉగ్రకుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) భగ్నం చేసింది. చెన్నై, నాగపట్నంలో పలువురు ఉగ్రవాదులు మకాం వేసి.. శ్రీలంక తరహా ఆత్మాహుతి దాడి, బాంబు పేలుళ్లకు పథక రచన చేస్తున్నట్లుగా ఎన్ఐఏకి సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు ఆది, శనివారాల్లో  చెన్నై, నాగపట్నంలలో సోదాలు నిర్వహించారు. చెన్నై మన్నడి లింగుచెట్టి వీధిలో ‘‘వాగాద్-ఈ-ఇస్లామీ హింద్’’ అనే తీవ్రవాద సంస్థ కార్యాలయం పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ప్రత్యేకంగా తమిళనాట పేలుళ్లు పాల్పడేందుకు ఏర్పాటైనట్లు తేల్చారు. ఈ సంస్థ అధినేత సయ్యద్ బుఖారీని చెన్నై-పూందపల్లి రహదారిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు తెలుసుకున్న ఎన్ఐఏ మెరుపుదాడి చేసి అతనిని పట్టుకుంది.

అలాగే ఇతని అనుచరులు అసన్ అలీ, ఆరిష్ మొహమ్మద్, తవ్‌హీద్ అహ్మద్‌లను నాగపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 9 సెల్‌ఫోన్లు, 15 సిమ్ కార్డులు, 7 మెమొరీ కార్డులు, 3 ల్యాప్‌టాప్‌లు, 5 హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.