మార్చి 15వ తేదీలోపు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లు!
మార్చి 15వ తేదీలోపు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లుగా రాష్ట్రపతి నియమించే అవకాశం ఉన్నది. 13 లేదా 14వ తేదీల్లో ప్రధాని సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
మార్చి 15వ తేదీలోపు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించే అవకాశాలు ఉన్నాయని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనూప్ చంద్ర పాండే రిటైర్‌మెంట్, అరుణ్ గోయల్ సంచలన రాజీనామాలతో ఎన్నికల కమిషన్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో అరుణ్ గోయల్ రాజీనామా సంచలనంగా మారింది. శుక్రవారం ఉదయం ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు వెంటనే న్యాయ శాఖ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. ఇద్దరు వెళ్లిపోవడంతో ఇప్పుడు ఎన్నికల సంఘంలో ఒక్కరే ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఉన్నారు.
కేంద్ర న్యాయ శాఖ ఆధ్వర్యంలో హోం సెక్రెటరీ, డీవోపీటీ సెక్రెటరీలతో ఓ సెర్చ్ కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ ఐదుగురు సభ్యుల చొప్పున రెండు పోస్టు కోసం రెండు వేర్వేరు ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తుంది. అప్పుడు కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ వారిని ఎన్నుకుంది. ప్రధానమంత్రి సారథ్యంలోని ఈ కమిటీలో కేంద్ర మంత్రి, లోక్ సభలో విపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిలు ఉంటారు. ఆ తర్వాత వారిని రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తారు.
Also Read: విజయనగరంలో పట్టాలు తప్పిన రైలు.. లోకో పైలట్‌కు గాయాలు
సెలెక్షన్ కమిటీ మార్చి 13 లేదా 14వ తేదీలలో భేటీ అవుతుంది. ఆ తర్వాత మార్చి 15వ తేదీన కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించే అవకాశం ఉన్నదని విశ్వసనీయవర్గాలు వివరించాయి.