న్యూడిల్లీ: దేశంతో హింసాత్మక  ఘటనలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు పన్నాగాలు పన్నుతున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించారు. ముఖ్యంగా దేశ రాజధాని డిల్లిలో  ఉగ్రదాడులు జరగవచ్చని హెచ్చరిస్తూ హై అలెర్ట్ ప్రకటించాయి. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు నగరంలో బందోబస్తును మరింత పెంచారు.

నలుగురు లేదా ఐదుగురు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ నుంచి ట్రక్ లో ఢిల్లీ చేరుకున్నట్లు నిఘావర్గాల సమాచారం.అంతేకాకుండా మరికొందరు ఢిల్లీలో రావడానికి  రోడ్డు మార్గంలో బస్సు, కారు లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాంటి విధ్వంసం చోటుచేసుకోకముందే ముందస్తుగా అప్రమత్తమవ్వాలని నిఘా వర్గాలు డిల్లీ అధికారులను హెచ్చరించాయి. 

read more  ఆయుధాలు సప్లై చేసే డ్రోన్ కూల్చివేత: సరిహద్దులో హైటెన్షన్

ఇదిలావుంటే జమ్మూ కాశ్మీర్ లోని జదిబాల్ లో ఆదివారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఉదయం జదిబాల్, పోజ్వల్‌పోరా‌ ప్రాంతాల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది.

ఉగ్రవాదుల తల్లిదండ్రులను తీసుకొచ్చి లొంగిపోవాలని హెచ్చరించినా కూడ వారు ససేమిరా అన్నారు. దీంతో ఎన్ కౌంటర్ లో చేయాల్సి వచ్చిందని...ఇందులో వీరు మరణించినట్టుగా కాశ్మీర్ ఇన్స్‌పెక్టర్ జనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.

మరణించిన టెర్రరిస్టుల్లో ఒకరు 2019 నుండి ఉగ్రవాదులు నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని పోలీసులు తెలిపారు. మరొక ఉగ్రవాది గత నెలలో బీఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా తేల్చారు.  ఈ ఎన్‌కౌంటర్ లో సీఆర్‌పీఎఫ్ కు చెందిన ముగ్గురితో పాటు ఓ సివిల్ పోలీస్ కూడా గాయపడ్డాడు. 

శ్రీనగర్ లో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఎన్ కౌంటర్. గత మే నెలలో జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బూల్ ముజాహిద్దీన్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.