అసలే సరిహద్దు వెంట ఉద్రిక్తత చోటుచేసుకుంటున్న నేపథ్యంలో... భద్రతాదళాలు తాజగా శత్రుదేశాలను చెందిన ఒక డ్రోన్ ని కూల్చివేసాయి. సరిహద్దు ఉద్రిక్థతలు తీవ్రంగా ఉన్న సమయంలో 20 మంది సైనికులు మరణించిన సందర్భంలో ఈ డ్రోన్  కూల్చివేత ప్రాధాన్యత సంతరించుకుంది. 

వివరాల్లోకి వెళితే... జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో బిఎస్ఎఫ్ అప్రమత్తమైంది. 

19వ బెటాలియన్‌కు చెందిన సరిహద్దు భద్రత దళం పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది. రాతువా సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి,  ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను నేలమట్టం చేశారు. 

ఈ డ్రోన్ కి గ్రెనైడ్లు, రైఫిళ్లు, మేగజైన్లు కూడా ఉండడంతో భద్రతాదళాలు అవాక్కయ్యారు. బహుశా భారత్ లో ఉన్న ఎవరికైనా ఆయుధాలను సప్లై చేస్తున్నారా అని భద్రతాబలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అప్రమత్తుమైన భద్రతాబలగాలు ఆ అన్ని ప్రాంతాల్లో ముమ్మర గాలింపులు చేపట్టారు. డ్రోన్ రేంజ్, దాన్ని పాకిస్తాన్ సైనికులు ఆపరేట్ చేస్తుండొచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ డ్రోన్ పరిధి ఎంతమేర ఉండొచ్చు అని బేరీజు వేసుకొని అక్కడ ముమ్మర తనిఖీలను చేపడుతున్నారు. 

ఇకపోతే... భారత సరిహద్దుల్లోకి ఎవరూ ప్రవేశించలేదని అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. గాల్వాన్‌లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆయన నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఆర్మీకి చెందిన ఏ ఒక్క పోస్టునూ చైనా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్న ప్రధాని.. సైనికులకు అత్యాధునిక ఆయుధాలను అందిస్తామని తెలిపారు.

చైనా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన మోడీ.. భారత్ శాంతి కోరుకుంటోందని, కానీ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాగా.. ఈ అఖిలపక్ష సమావేశంలో 20 మంది పార్టీ నేతలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పాల్గొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

ఘర్షణలకు ముందు, తర్వాత పరిస్థితిని ఆయన వివిధ పార్టీల నేతలకు వివరించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

టెలికాం, రైల్వే, విమానయాన రంగాల్లోకి చైనాను అనుమతించొద్దని టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. చైనీయులు ప్రవేశించడానికి తాము ఒప్పుకోమని ఆమె స్పష్టం చేశారు