Asianet News TeluguAsianet News Telugu

టీచర్‌‌ దాడిలో దళిత విద్యార్థి మృతి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా.. అశోక్‌ గెహ్లాట్‌కు కొత్త కష్టాలు..

రాజస్థాన్‌లో టీచర్‌ విచక్షణరహితంగా కొట్టడంతో దళిత విద్యార్థి మృతిచెందిన ఘటన.. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌కు రాజకీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. 

New Crisis For Ashok Gehlot After Dalit Child death
Author
First Published Aug 16, 2022, 5:02 PM IST

రాజస్థాన్‌లో టీచర్‌ విచక్షణరహితంగా కొట్టడంతో దళిత విద్యార్థి మృతిచెందిన ఘటన.. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌కు రాజకీయ సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని ఓ స్కూల్‌లో ‘‘అగ్రవర్ణాల’’ కోసం ఉద్దేశించిన కుండలోని నీరు తాగినందుకు దళిత విద్యార్థిపై టీచర్‌ దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నుంచే కాకుండా.. సొంత పార్టీ నుంచే అధికార కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటుంది. 

9 ఏళ్ల విద్యార్థిని మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని బరన్-అత్రు కాంగ్రెస్ ఎమ్మెల్యే పనచంద్ మేఘ్వాల్ తన రాజీనామాను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు పంపారు. రాష్ట్రంలో కుల సంబంధిత నేరాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తానని రెండేళ్ళ క్రితం తిరుగుబాటు చేసిన మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ఈ ఘటనపై వేగంగా స్పందించారు. చనిపోయిన బాలుడి కుటుంబాన్ని కలవడానికి ఆయన జలోర్ జిల్లాకు వెళుతున్నారు. ‘‘మనం జలోర్ వంటి సంఘటనలకు ముగింపు పలకాలి. దళిత సమాజంలోని ప్రజలకు మనం వారితో పాటు నిలబడతామని హామీ ఇవ్వాలి’’ అని సచిన్ పైలట్ అన్నారు. 

ఈ క్రమంలోనే అప్రమత్తమైన సీఎం అశోక్ గెహ్లాట్.. సీనియర్ క్యాబినెట్ మంత్రులను, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాను జలోర్‌కు తరలించారు. అదే సమయంలో కొంతమంది నాయకులు పార్టీ కార్యకర్తలను గౌరవంగా చూడటం లేదని చెబుతూ వారిని రెచ్చగొడుతున్నారని అన్నారు. ‘‘మీరు ఎప్పుడైనా కార్మికులను గౌరవించారా? మీకు గౌరవం, మర్యాద ఏమిటో తెలుసా?’’ అని ఎవరిపేర్లను ప్రస్తావించకుండా ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తల గౌరవం తనకు చాలా ముఖ్యమని.. ఏదో ఒకరోజు కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..
తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి.. అగ్రవర్ణాల కోసం ఉద్దేశించిన కుండలోని నీటిని తాగినందుకు టీచర్‌ కొట్టడంతో అతని కన్ను, చెవిపై గాయాలయ్యాయి. జులై 20న ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తర్వాత బాలుడిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు గత వారం మరణించాడు. ఇందుకు సంబంధించి పోలీసులు టీచర్‌ను అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.  5 లక్షల సాయం ప్రకటించారు. అయితే ఈ ఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడింది. ‘‘రాజస్థాన్‌లో దళితులకు న్యాయం జరిగేలా గెహ్లాట్‌ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఎప్పుడు సూచిస్తారు’’ అని రాష్ట్ర బీజేపీ ట్వీట్ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios